ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయాన్ని వైఎస్సార్సీపీ మరోసారి లోక్‌సభలో లేవనెత్తింది. ఇది ఆంధ్రప్రదేశ్  ప్రజల హక్కు అని, ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రం దానిని ఇప్పటికైనా రాష్ట్రానికి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం అండగా నిలిచి, అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలో జరిగిన చర్చలో, విభజనతో ఏపీ ఎలా నష్టపోయిందో మిథున్ రెడ్డి వివరిస్తూ, ప్రత్యేక హోదా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ''వైఎస్సార్‌సీపీకి 20 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. మేము ఎన్నోసార్లు ప్రత్యేక హోదా విషయాన్ని లేవనెత్తాం. వివిధ ఫార్మాట్లలో 100 సార్లు విజ్ఞప్తి చేశాం. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు'' అని అన్నారు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఏపీని చాలా అన్యాయంగా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 15,454 కోట్లు ఉంటే, ఏపీకి రూ. 8,979 కోట్లు మాత్రమేని పేర్కొన్నారు. తాము జనాభాలో 56%, ఆదాయంలో 45%, అప్పులను 60% వారసత్వంగా పొందామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సభలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. కానీ విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదన్నారు. కాబట్టి.. కేంద్రం మరోసారి ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షల్ని జాతీయ స్థాయిలో చర్చించి.. ఈ హోదాని సాధించేందుకు వైసీపీ కట్టుబడి ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ సమస్యలను లేవనెత్తడం ద్వారా.. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరోసారి ప్రత్యేక హోదాను చర్చకు తెచ్చిందని, కేంద్ర ఈ అంశాన్ని పరిష్కరిస్తుందని నమ్మకం ఉందని ఆయన మిథున్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)