50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభం !

Telugu Lo Computer
0


దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్‌కు తెలిపారు. గుజరాత్‌లో అన్ని జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. “టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అక్టోబర్ 1, 2022 నుంచి దేశంలో 5జీ సేవలను అందించడం ప్రారంభించారు. నవంబర్ 26, 2022 నాటికి, 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాలలో 5జీ సేవలు ప్రారంభించబడ్డాయి” అని చౌహాన్ చెప్పారు. టెలికాం ఆపరేటర్లు అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 2022 నాటికి దేశంలోని 6,44,131 గ్రామాల్లో 6,05,230 గ్రామాలు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయని, 38,901 గ్రామాలకు మాత్రమే కనెక్టివిటీ లేదని ఆయన వెల్లడించారు. గ్రామాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీపై లోక్‌సభలో అడిగిన ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలో మొబైల్ కవరేజీపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఆయా జిల్లాల్లో 25 శాతానికి పైగా గిరిజన జనాభా ఉన్న 1,20,613 గ్రామాలలో 1,00,030 లేదా 83 శాతం గ్రామాలు మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని కలిగి ఉన్నాయని, 20,583 గ్రామాలు ఎటువంటి మొబైల్ కవరేజీని కలిగి లేవన్నారు. దేశంలో సుమారు 2.6 లక్షల గ్రామ పంచాయతీలు (జీపీలు) ఉన్నాయని, వాటిలో 1,84,399 గ్రామపంచాయతీలు సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నాయని భారత్‌నెట్ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)