కాల్పుల ఘటనలో ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


అసోం ఫారెస్టు గార్డులు జరిపిన కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు మృతి చెందారు. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతం నుంచి మేఘాలయకు చెందిన కొందరు వ్యక్తులు టింబర్‌తో తిరిగి వస్తుండగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దృవీకరించారు. కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురితో పాటు, అసోం ఫారెస్ట్ గార్డు కూడా మృతి చెందినట్టు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు. మేఘాలయ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. సరిహద్దుల్లో కాల్పుల ఘటనపై అప్రమత్తమైన మేఘాలయ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఉదయం 10.30 గంటల నుంచి 48 గంటల సేపు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెంస్ట్ జైన్‌టియా హిల్స్‌లోని ముక్రోహ్‌లో ఘటన జరిగినట్టు సమాచారం ఉందని ఆ ఆదేశాల్లో మేఘాలయ హోం శాఖ తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా వెస్ట్ జయతియా హిల్స్, ఈస్ట్ జయతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి-బొయో, ఈస్ట్రన్ వెస్ట్ ఖాసీ హిల్స్, సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాల్లో టెలికాం, సోషల్ మీడియా సర్వీసులను నిలిపివేసినట్టు చెప్పింది. అసోం, మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉండగా, 12 వివాదాస్పద ప్రాంతాలున్నాయి. వీటిలో ఆరు ప్రాంతాలకు సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ మంత్రి కాన్రాడ్ సంగ్మా మధ్య గత మార్చిలో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇది చారిత్రక ఒప్పందమని, ఈ అవగాహనా ఒప్పందంతో 70 శాతం వివాదం పరిష్కారమైందని హోం మంత్రి అమిత్‌షా అప్పట్లో ప్రకటించారు. తక్కిన ఆరు వివాదాస్పద ప్రాంతాలపై కూడా ఇద్దరు సీఎంలు ఆగస్టులో చర్చలు జరుపుతారని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో తాజా కాల్పులు చోటుచేసున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)