మోర్బీ ఘటన రోజు అమ్మకానికి 3వేల టికెట్లు !

Telugu Lo Computer
0


గుజరాత్‌లో జరిగిన తీగల వంతెన దుర్ఘటన తీవ్ర విషాదం నింపింది. 130కి పైగా ప్రాణాలు బలితీసుకుంది. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై ఉండటం, నిర్వహణ లోపం ఈ విషాదానికి కారణమని ప్రాథమికంగా తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం తరఫు న్యాయవాది జిల్లా కోర్టులో ఫొరెన్సిక్ నివేదికను సమర్పించగా.. కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘటన రోజున నిర్వహణ సంస్థ 3,165 టికెట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడైంది. అయితే అవన్నీ పూర్తిగా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. ఆ నివేదిక ప్రకారం.. వంతెన తీగలు తుప్పు పట్టాయని, యాంకర్లకు తీగలను అనుసంధానించే బోల్టులు కూడా వదులుగా ఉన్నాయని తెలిసింది. ఇంకా సెక్యూరిటీ సిబ్బంది, టికెట్ కలెక్టర్ అంతా రోజువారీ కూలీలని.. వారికి పర్యాటకులను నియంత్రించే విషయంలో ఎలాంటి అనుభవం లేదని న్యాయవాది వెల్లడించారు. రక్షణపరమైన నిబంధనల గురించి వారికి వెల్లడించలేదని, ఒక విడతలో వంతెన మీదకు ఎంత మందిని పంపాలో కూడా చెప్పలేదని తెలిపారు. నిర్వహణ సంస్థ (ఒరెవా గ్రూప్‌) సిబ్బంది బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా, న్యాయవాది కోర్టులో ఈ వాదనలు వినిపించారు. 'వంతెన విషయంలో ఒరెవా సంస్థనే రక్షణపరమైన చర్యలకు బాధ్యత వహించాలి. ప్రమాదం వేళ ఘటనాస్థలిలో ఎలాంటి లైఫ్ గార్డ్స్‌, పడవలు అందుబాటులో లేవు' అని జిల్లా స్థాయి అధికారి ఒకరు మీడియాతో వెల్లడించారు. ఈ ఘటనను గుజరాత్‌ హైకోర్టు సుమోటో విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై మోర్బీ స్థానిక యంత్రాగంపై పరుషంగా స్పందించింది. టెండర్లు ఆహ్వానించకుండా ఒక సంస్థకు పనులు ఎలా అప్పగిస్తారని వరుస ప్రశ్నలు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)