యాత్రలో నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారు !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మధ్య ప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు తెలిపే ఓ వాట్సాప్ సందేశాన్ని ఈ ఆరోపణలకు మద్దతుగా చూపించింది. గాంధీతో 15 నిమిషాలపాటు నడవడం కోసం నటీనటులు తమకు నచ్చిన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చునని ఈ సందేశం చెప్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందిస్తూ, ఈ వాట్సాప్ సందేశాన్ని ఎవరు పంపించారో చెప్పడం లేదని, కేవలం యాత్రను అపఖ్యాతిపాలు చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రలో సినీ నిర్మాత, దర్శకుడు అమోల్ పాలేకర్ పాల్గొన్న తర్వాత బీజేపీ నేతలు ఈ ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ''ఓ నాయకుడిగా రాహుల్ గాంధీ యోగ్యత, లక్షణాలు కొత్తదనాన్ని సంతరించుకోవడం అటుంచి, ఆయన యాత్ర సాధించినది ఏమిటంటే, ఆయన చుట్టూ సొంత డబ్బా కొట్టే కోటరీ ఎదుగుదలకు ప్రోత్సహం లభించింది. ఇలాంటి చెల్లింపు ప్రజా సంబంధాల (పెయిడ్ పీఆర్) వల్ల మరింత హాని జరుగుతోంది. అయితే కొంత సొమ్ము కోసం అయినా రాహుల్‌తో కలిసేందుకు ఇష్టపడుతున్నవారు ఎవరు?'' అని ప్రశ్నించారు. అమిత్ మాలవీయ ప్రశ్నకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఘాటుగా స్పందించారు. బీజేపీ చూపిస్తున్న వాట్సాప్ సందేశంలో దానిని పంపినవారి పేరు, నంబరు లేవన్నారు. దానికి ఏమాత్రం విలువ లేదన్నారు. తమకు కృత్రిమ మద్దతు ఇవ్వాలని కళాకారుల చెవి నులిమే కళలో నిపుణులు బీజేపీవారేనన్నారు. కాంగ్రెస్‌కు అటువంటి నైపుణ్యం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలో కొందరు సెలబ్రిటీలు ఇచ్చిన ట్వీట్లు మనకు గుర్తు లేవా? అన్నారు. అదే విధంగా రైతుల నిరసనల సమయంలో సెలబ్రిటీల ట్వీట్లు గుర్తున్నాయన్నారు. నియంతృత్వ, విభజనవాద బీజేపీ ఎజెండాకు వ్యతిరేకంగా నిలవడానికి చాలా ధైర్యం ఉండాలన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నవారు మన దేశానికి మద్దతిస్తున్నారని చెప్పారు. యాత్రలో పాల్గొంటున్న సెలబ్రిటీల నిజాయితీని మసకబార్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తమ దృఢనిశ్చయాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. తమ యాత్ర సరైన బాటలో నడుస్తోందని బీజేపీ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)