ముస్లింలను ఏటీఎంలా వాడుకుంటున్నారు

Telugu Lo Computer
0


దేశ రాజకీయాల్లో ముస్లింల పాత్రను పరిమితం చేయడంలో మోదీ విజయవంతం అయ్యారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం మోదీ వల్లే ఇతర రాజకీయ పార్టీలు కూడా ముస్లింలను పట్టించుకోవడంలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకులాగా, ఏటీఎంలాగా వాడుకుంటున్నారని విమర్శించారు. చివరకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో కూడా ముస్లింలకు గౌరవం లేదని అన్నారు అసదుద్దీన్. కర్నాటకలోని హుమ్నాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్, ఇతర పార్టీలలో ముస్లింల రాజకీయ ప్రాధాన్యం రోజు రోజుకీ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింల సమస్యలపై స్పందించడం లేదని.. అంతగా దేశ రాజకీయాలను మార్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలని సెటైర్లు వేశారు అసదుద్దీన్. భారత రాజకీయాల్లో ఇప్పుడు ముస్లింలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు. బిల్కిస్ బానో కేసులో రేపిస్ట్ లను విడుదల చేసినా సెక్యులర్ పార్టీలు మౌనం వహించాయని, ఇలాంటి పార్టీలు మీకు అవసరమా అని ప్రశ్నించారు అసదుద్దీన్. రాజకీయ పార్టీలు కావాలో, అల్లా కావాలో ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పారు. ముస్లింలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, కానీ ఎవరూ మాట్లాడటంలేదన్నారు. ఇది అంబేద్కర్ భూమి అని, మన రక్తం, చెమటలో ఈ భూమికి స్వాతంత్రం తెచ్చుకున్నామని, ఆ పోరాటంలో ముస్లింలు కూడా ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ లేవని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసినవారు జీరోలయ్యారని, పోరాటం తర్వాత వచ్చినవారంతా హీరోలవుతున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ప్రధాని మోదీయేనని ధ్వజమెత్తారు అసదుద్దీన్.

Post a Comment

0Comments

Post a Comment (0)