22వ రోజుకి చేరిన రైతుల పాదయాత్ర

Telugu Lo Computer
0


అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కలిసి నడుస్తున్నారు. 21వ రోజు ఏలూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగింది. ఒకరోజు బ్రేక్‌ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల నుంచి తిరిగి మొదలైన యాత్ర రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం మీదుగా దూబచర్ల వరకు సాగింది. ఆ తర్వాత అమరావతి రైతుల పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. యాత్రకు సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొంత దూరం రైతులతో కలిసి నడిచారు. అయితే, ద్వారకా తిరుమల అంబేద్కర్‌ సెంటర్‌ దగ్గర కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. బస్టాండ్‌ వైపు యాత్రను అనుమతించకపోవడంతో రైతులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రైతుల నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు, ఆ తర్వాత బస్టాండ్‌ రూట్లో పాదయాత్రకు పర్మిషన్‌ ఇచ్చారు. ఇవాళ, దూబచర్ల నుంచి తిరిగి యాత్ర ప్రారంభమైంది. నల్లజర్ల మీదుగా ప్రకాశరావుపాలెం వరకు యాత్ర సాగనుంది. 22వ రోజు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)