అప్పు తీర్చలేదని వివస్త్రలను చేసి చితకబాదిన ఘటన

Telugu Lo Computer
0


కర్ణాటక లోని అనేకల్ జిల్లాలోని దొడ్డబొమ్మసంద్ర లో అప్పు తీసుకుని చెల్లించనందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి చితకబాదిన ఘటనపై కేసు నమోదు చేసేందుకు రెండు రోజులుగా నిరాకరిస్తున్న పోలీసులు, మహిళలపై దాడికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాక మాత్రమే కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థుల ఆగ్రహంతో దిగొచ్చిన పోలీసులు నిందితులైన రామకృష్ణారెడ్డి, సునీల్ కుమార్‌లను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రమ్మను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. స్థానిక మీడియా కథనాలను బట్టి బాధిత అక్కాచెల్లెళ్లలో ఒకరు తన పిల్లల చదువు కోసం నిందితుల్లో ఒకరి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. ఆ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేశాడు. అయితే, ఆ మొత్తాన్ని ఆమె ఒకేసారి చెల్లించలేకపోయింది. దీంతో అతడి వేధింపులు ఎక్కువ కావడంతో గ్రామస్థులు జోక్యం చేసుకున్నారు. ఆమె తన పొలాన్ని విక్రయించి డబ్బులు ఇస్తుందని నిందితుడికి నచ్చజెప్పారు. అయితే, అప్పటి వరకు వేచి చూడలేనంటూ బాధిత మహిళతోపాటు ఆమె సోదరిపైనా దాడి చేశారు. ఇద్దరినీ వివస్త్రలను చేసి చావబాదారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళలకు అక్కడ చుక్కెదురైంది. కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన సీఐ, సమస్యను ఇద్దరూ కలిసి పరిష్కరించాలని సూచించి, బాధితులను తిప్పి పంపారు. అయితే, వారిపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కర్ణాటక  హోం మంత్రి అరగ జానేంద్ర స్పందించారు. తనకు ఇప్పుడే ఈ విషయం తెలిసిందని, వారికి న్యాయం చేస్తామని అన్నారు. దాడి ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)