మానవ రహిత యుద్ధ విమానం ప్రయోగం విజయవంతం !

Telugu Lo Computer
0


మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ను శుక్రవారం కర్ణాటక లోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ను పరీక్షించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇది పూర్తిగా తనంతట తాను పని చేస్తుందని తెలిపింది. ఇది బయల్దేరడం దగ్గర నుంచి వే పాయింట నేవిగేషన్, తిరిగి క్రిందకు దిగడం వరకు కచ్చితమైన పనితీరును ప్రదర్శించిందని తెలిపింది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధి దిశగా ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం పని తీరు విషయంలో ఈ పరీక్ష గొప్ప మైలురాయి వంటిదని పేర్కొంది. ఇటువంటి వ్యూహాత్మక రక్షణ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో స్వయం సమృద్ధత సాధించే దిశగా ఓ ముఖ్యమైన ముందడుగు పడిందని తెలిపింది. మానవ రహిత గగనతల వాహనంను బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ప్రముఖ పరిశోధక ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) డిజైన్ చేసి, అభివృద్ధి చేసింది. దీనికి చిన్న, టర్బోఫ్యాన్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి అమర్చిన ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లయిట్ కంట్రోల్స్, ఏవియానిక్స్ సిస్టమ్‌లను మన దేశంలోనే అభివృద్ధిపరచారు. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ పరీక్ష విజయవంతమైనందుకు డీఆర్‌డీవోను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. స్వయంప్రతిపత్తిగల విమానాల తయారీ దిశగా ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. ముఖ్యమైన సైనిక వ్యవస్థల విషయంలో మన దేశం స్వయం సమృద్ధత సాధించడానికి బాటలుపరచే విజయమని పేర్కొన్నారు. దీని డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్‌ల కోసం కృషి చేసిన అందరినీ డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్ రెడ్డి అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)