ప్రజలు రేషన్ తెచ్చుకోలేరా ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 July 2022

ప్రజలు రేషన్ తెచ్చుకోలేరా ?


ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల విలీనం పేరుతో విద్యార్థులు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి చదువుకోవాల్సిన పరిస్థితిని కల్పించిన ప్రభుత్వం, తమ గ్రామంలోనే ఉన్న రేషన్ షాపుల వద్దకు వెళ్లకుండా పేదలకు ఇంటికే సరుకులు ఇవ్వడంలో హేతుబద్ధత ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేషన్‌ సరఫరాకు ఏర్పాటు చేసిన వాహనాలతో ప్రజాధనం వృథా కాదా? నిజంగానే రేషన్ సరుకులు తెచ్చుకోలేని స్థితిలో రాష్ట్రంలో పేదలున్నారా అని ప్రశ్నిస్తూనే, ప్రజాధనం వృథాపై సర్కార్‌ను గట్టిగా నిలదీసింది హైకోర్టు. వాహనాల ద్వారా రేషన్ సరుకులను ఇంటికే సరఫరా చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు పలు ప్రశ్నలకు వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కి.మీ. దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లకుండానే ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని కోర్టు పేర్కొంది. వీలు చూసుకుని ప్రజలు అరగంట కేటాయిస్తే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని, ఆ స్థితిలో కూడా పేదలు లేరా అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేషన్ సరుకుల పంపిణీకి డీలర్ కు ఇచ్చే కమీషన్ కంటే డోర్ డెలివరీ ద్వారా ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. రేషన్ షాపులకు రాకుండా డోర్ డెలివరీ చేయడానికి చేసే ఖర్చుతో పేదలకు మరిన్ని రేషన్ సరుకులు అందించొచ్చని కోర్టు సూచించింది. సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నదని.. మరి కేంద్రం నుంచి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి తీసుకున్నారా, ఏ నిబంధనలను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ 'ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం' హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ పథకం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఉద్దేశం సక్రమంగా నెరవేరుతున్నట్లు కనిపించడం లేదన్నారు. మొబైల్‌ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని ఇంటి వద్దే ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. ఇంటింటికీ రేషన్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు 92 వేల మందిని నియమించగా, వాహనదారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. రేషన్ డెలివరీ వాహనాల కోసం సైతం రూ.600 కోట్లు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి చోట రేషన్ డోర్ డెలివరీ చేస్తే అర్థం ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాలు సమర్పించాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వాలు పలు విధానాలు అమలు చేస్తాయని అందులో భాగంగా రేషన్ సరుకులని పేద ప్రజలకు ఇంటింటికీ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ శ్రీరామ్‌. అయితే ఇలాంటి ప్రభుత్వ విధాన నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదన్నారు. అయితే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment