ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు కరోనా టీకా !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో సాగర్ నగరంలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో బుధవారం కరోనా టీకా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్‌ విద్యార్థులకు టీకాలు వేశారు. వ్యాక్సిన్‌ వేసే జితేంద్ర కరోనా నిబంధనలు ఉల్లంఘించాడు. ఒక్కో విద్యార్థికి టీకా కోసం ఒక్కో సిరంజి వినియోగించాల్సి ఉంది. అయితే జితేంద్ర కేవలం ఒక్క సిరంజితో స్కూలుకు వచ్చాడు. ఆ ఒక్క సిరంజితోనే సుమారు 30 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశాడు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. జితేంద్రను దీనిపై నిలదీశారు. అయితే అధికారులు తనకు కేవలం ఒక్క సిరంజి మాత్రమే ఇచ్చారని జితేంద్ర తెలిపాడు. ఇందులో నా తప్పు ఏముంది అని ఎదురు ప్రశ్నించాడు. మరోవైపు ఈ సంఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందించారు. స్కూల్‌లోని వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని వెంటనే తనిఖీ చేయాలని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అయితే అధికారులు చేరుకునేలోపు జితేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌లో ఉంచాడు. దీంతో అధికారుల ఫిర్యాదుతో పోలీసులు జితేంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే జిల్లా వ్యాక్సినేషన్‌ అధికారి డాక్టర్‌ రాకేష్ రోషన్‌పై కూడా శాఖాపరమైన దర్యాప్తు, చర్యలకు ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)