కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు !

Telugu Lo Computer
0


కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇకపై కోనసీమ జిల్లా డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. కేబినెట్‌లో 32వ అంశంగా కోనసీమ జిల్లా పేరును కేబినెట్ ప్రతిపాదించింది. ఇటీవల కోనసీమ జిల్లా మార్పు అంశంపై అమలాపురంలో తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేయడమే కాకుండా ఇంటర్నెట్‌ను కూడా అధికారులు నిలిపేశారు. అమలాపురం అల్లర్ల ఘటనలో దాదాపు 150 మందిపై కేసులు నమోదయ్యాయి. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో 1300 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. మరోవైపు కోనసీమ జిల్లా అదే పేరు కొనసాగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో 12 పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లన్నింటిపై కలిసి విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరు అంశంపై జిల్లా వాసుల నుంచి అభిప్రాయసేకరణ కూడా పూర్తి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)