కెనడాలో భారత విద్యార్థి మృతి

Telugu Lo Computer
0


కెనడాలో భారత విద్యార్థిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ దేశ రాజధాని టొరంటోలోని సబ్‌వే స్టేషన్‌ ప్రవేశం వద్ద ఈ నెల 7న ఈ ఘటన జరిగింది. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన కార్తిక్ వాసుదేవ్‌గా గుర్తించారు. 21 ఏండ్ల కార్తిక్‌ ఈ ఏడాది జనవరిలో టొరంటో వెళ్లాడు. సెనెకా కాలేజీలో మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. అక్కడ పార్ట్‌ టైమ్ జాబ్‌ కూడా చేస్తున్నాడు. గురువారం సాయంత్రం మెట్రో సబ్‌వే స్టేషన్‌ ఎంట్రన్స్‌ గేట్‌ వద్దకు చేరుకున్న కార్తీక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర బుల్లెట్‌ గాయాలైన కార్తీక్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్‌ మరణించినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అతడిపై ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని కార్తీక్‌ తల్లిదండ్రులకు తెలియజేసింది. కాల్పుల్లో అతడు మరణించడంపై సంతాపం వ్యక్తం చేసింది. మృతదేహం భారత్‌ చేరేందుకు ఏడేనిమిది రోజులు పడుతుందని పేర్కొంది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఈ విషాద సంఘటనతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)