సిలబస్ లో అమరావతి పాఠం తొలిగింపు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల పైన అనిశ్చితి కొనసాగుతున్న పరిస్థితుల్లో పదో తరగతి తెలుగు పుస్తకంలో రూపొందించిన అమరావతి పాఠాన్ని అధికారులు సిలబస్ నుంచి తొలిగించారు. పాఠ్యాంశంలో భాగంగా శాతవాహన రాజులు వారి ముందు అమరావతిని కేంద్రంగా చేసుకొని నాటి పాలన ఎలా సాగిందనేది అందులో వివరించారు. దీంతో పాటుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇప్పుడు రాజధానిగా ఎంపిక చేసారనే అంశాన్ని అందులో ప్రస్తావించారు. అయితే, తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని సిలబస్ నుంచి తప్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావటంతో విద్యార్ధులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అమరావతి వివరాలతో పదో తరగతిలో రెండో పాఠంగా దీనిని టీడీపీ ప్రభుత్వ హాయంలో ముద్రించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెర పైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం న్యాయ వివాదాల కారణంగా ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీని పైన ముందుకే వెళ్తామని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీని కారణంగానే ప్రస్తుత సిలబస్ నుంచి అమరావతి పాఠం తొలిగించారనే విమర్శ మొదలైంది. ఇప్పటికే ఈ పాఠాన్ని ఉపాధ్యాయులు విద్యార్ధులకు భోదన పూర్తయిందని తెలుస్తోంది. ఈ నెల 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్షలు మొదలవుతున్నాయి. పదో తరగతి విద్యార్ధులకు తాజాగా ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేసారు. సిలబస్ లోని అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలనవి పరీక్షల కోసం చదువుకొని సిద్దం కావాలని సూచిస్తున్నారు. ఇప్పుడు, విద్యాశాఖ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పైన విమర్శలు మొదలయ్యాయి. సిలబస్ భారం తగ్గించాలంటే చివర్లో ఉన్న పాఠాలను మినహాయించాల్సి ఉంటుందని..ఇప్పుడు రెండో పాఠంగా ఉన్న అమరావతి పాఠం తొలిగించటం ఉద్దేశ పూర్వకంగానే చేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఇప్పుడు సిలబస్ నుంచి అమరావతి తొలిగింపు చర్చకు కారణమవుతోంది. దీని పైన విద్యా శాఖ అధికారికంగా ఎటువంటి వివరణ ఇస్తుందనేది చూడాల్సి ఉంది. తాజాగా, హైకోర్టు తీర్పు పైన ప్రభుత్వం అఫిడవిట్ సైతం దాఖలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)