తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్నకనిష్ట ఉష్ణోగ్రతలు

Telugu Lo Computer
0


తూర్పు, ఈశాన్యం నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు అలాగే ఉంటాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత మరికొన్ని రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొనసాగనుంది. అత్యల్పంగా కళింగపట్నంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 16.8డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18.4 డిగ్రీలు, నందిగామలో 18.9 డిగ్రీలు, తునిలో 18.7 డిగ్రీలు, బాపట్లలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 17.1 డిగ్రీలు, నంద్యాలలో 17.8 డిగ్రీలు, కర్నూలులో 19.4 డిగ్రీలు, తిరుపతిలో 19.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల లాగే సీమలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు దట్టంగా కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి. వర్షాలు లేకపోయినా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)