టాప్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ కు అగ్రస్థానం!

Telugu Lo Computer
0


దేశంలోనే టాప్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలువనున్నది. 2022లో 80 లక్షల చదరపు అడుగుల (8 మిలియన్లు) విస్తీర్ణంతో కూడిన ఆఫీస్‌కు నగరంలో డిమాండ్‌ ఉంటుందని రియల్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై సావిల్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేషసాయి మాట్లాడుతూ తెలంగాణలో చురుకైన ప్రభుత్వ విధానాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ కలిగిన నిపుణులు, భద్రత వంటి అంశాలు ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల కార్యకలాపాలకు ఎంతో అనుకూలంగా మారాయని తెలిపారు. 2021లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగినట్లుగానే 2022లో సైతం ఐటీ, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 80 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగిపోతున్నదని, దీంతో హైదరాబాద్‌ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర నగరాల్లోని ప్రీమియం ఆఫీస్‌ స్పేస్‌ భవనాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఎక్కువగా డిమాండ్‌ ఉందన్నారు. అంతర్జాతీయ కంపెనీలు మధ్యవర్తుల ద్వారా స్థలాలను లీజుకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోంను ఎత్తేస్తున్నాయి. లక్షలాదిమంది ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆఫీస్‌ స్పేస్‌లకు ఎక్కువగా డిమాండ్‌ పెరుగుతున్నదని శేషసాయి తెలిపారు. భవిష్యత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లు కోటి చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 1.20కోట్ల వరకు ఆఫీస్‌ స్పేస్‌తో కూడిన భవనాలను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది 57 లక్షల చదరపు అడుగుల (5.7 మిలియన్లు) విస్తీర్ణంలో లావాదేవీలు జరిగాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)