పోలీసు దళాల ఆధునికీకరణకు కేంద్రం నిధులు

Telugu Lo Computer
0


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు దళాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రత్యేక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి 2025-26 వరకు అమలయ్యే పోలీసు దళాల ఆధునికీకరణ (ఎంపీఎఫ్) పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ ఉప పథకాలు దీనిలో ఉంటాయని, మొత్తం మీద రూ.26,275 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. వనరులను ఆధునికీకరించడం ద్వారా శాస్త్రీయంగా, సకాలంలో దర్యాప్తు జరగడానికి ఈ పథకం ద్వారా కృషి చేస్తామని పేర్కొంది. హై క్వాలిటీ ఫోరెన్సిక్ సైన్సెస్ ఫెసిలిటీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించే విధంగా వీటిని తీర్చిదిద్దుతామని తెలిపింది. ఫోరెన్సిక్ ఫెసిలిటీస్ ఆధునికీకరణ కోసం రూ.2,080.50 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. జమ్మూ-కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతకు సంబంధించిన వ్యయం కోసం రూ.18,839 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల హింసాత్మక సంఘటనలు తగ్గినట్లు తెలిపింది. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయ పథకం క్రింద రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)