టి.జి.కమలాదేవి అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేశారు.ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించారు.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించారు. పాతాళభైరవి, మల్లీశ్వరి లాంటి హిట్ సినిమాల్లో నటించారు.ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించారు. టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించారు. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని కార్వేటినగరం నుండి పుత్తూరుకు మార్చారు. తండ్రికి పుత్తూరులో అటవీ శాఖలో పని దొరికింది. కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు చదివారు. క్రిస్టియన్ మిషనరీ తిరిగి ఐదవక్లాస్ స్కూల్లో చదివారు. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచురామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించారు. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడారు. పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించారు. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరి నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు. మరో సంఘటనలో సక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించారు. ఆంధ్ర సెక్రటరియేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించారు. ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్ తరపున ఓపెన్ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది. టి.చలపతిరావు ఈమెకు నేను కనలేని జీవితము... అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్ రికార్డింగ్‌లో పాడించారు. చిన్న వయస్సులోనే కనకతార, భూపుత్రి, ఐదు పువ్వుల రాణి వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుండి సినిమాలంటే ఆసక్తి, ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం చెన్నై లోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచారు. రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. 1950లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేశారు. 1939వ సంవత్సరంలో పుత్తూరులో వందేమాతరం చిత్ర కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్యకు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి చెన్నై వెళ్ళాక బి.ఎన్.రెడ్డితో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశారు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నారు.అయితే ఆ పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే చూడామణి చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో 1941లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించారు.ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. తెనాలి రామకృష్ణ సినిమాలో నటించి హెచ్.ఎం.రెడ్డి ఆశీస్సులు పొందారు. దక్షయజ్ఞంలో రోహిణిగా, సీతారామ జననంలో అహల్యగా నటించారు. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో నే ధన్యనైతిని రామా అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించారు. కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. సతీసావిత్రి, తులాభారం, కీచక వథ వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే కనకతార వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందారు.లవకుశ సినిమా గ్రామఫోను రికార్డు ఈమెకి మంచి పేరు తెచ్చింది. వయసు పెరిగే కొద్దీ సావిత్రి, వరూధిని, కీచకవధ వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవమూ గడించారు.అప్పటి ఆంధ్ర సెక్రటేరియట్ నాటక సమాజం ఆంధ్ర రాష్ట్రంలోనేకాక గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకంలో కమలాదేవి రుక్సానా పాత్రను 20 మార్లు నటించి, ఆపాత్రకు జీవాన్ని ఇచ్చింది. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనక లింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్, ఎ.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకిగానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది. అన్నా చెల్లెలు, రోషనార, కబీరు, నూర్జహాన్, పరివర్తన వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, కబీరు, నూర్జహాన్ తమిళనాడులోను మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించారు. నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి. 1983లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఈమెకు నాటక కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది. ఈమె తొలి నుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది. 1945 నుంచే ఆకాశవాణిలో 'ఎ' గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది బాలాంత్రపు రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావు బాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేశారు.అనార్కలి నాటకంలో ఆవుల చంద్రబాబు నాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించారు. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. 1946 అక్టోబరులో ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్ నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉన్నారు. 1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకున్నారు. ఇంకో కథనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించారు. 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్ తో బెంగళూరులో తలపడ్డారు. ఆ తరువాత అఖిల భారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడ్డారు.1994, 1995లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచారు.తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచారు.జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడారు. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో 1991లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచారు. పాతాళభైరవి సినిమాలో ఇతిహాసం విన్నారా ఆ అతిసాహసులే ఉన్నారా గీతాన్ని ఆలపించారు. ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లనగ్రోవిని ప్రియా ప్రియా అన్న దేవులపల్లి గీతాలు పాడారు. దొంగలున్నారు జాగ్రత్తలో జి.వరలక్ష్మికి, భక్త రామదాసులో కన్నాంబకు, గొల్లభామలో అంజలీదేవికి నేపథ్య గానం చేశారు. సంపూర్ణ రామాయణంలో పద్మినికి, పాండురంగ మహత్యంలో బి.సరోజాదేవికి, ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్ చెప్పారు. కంజన్ అనే తమిళ సినిమాలోనూ నటించారు. 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పనిచేశారు. చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీకి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
Post Top Ad
adg
Tuesday, 28 December 2021
Home
cinema
క్రీడాకారిణి
గాయని
టి.జి.కమలాదేవి
స్నూకర్స్ ఛాంపియన్ షిప్
స్నూకర్స్ ఛాంపియన్ షిప్ .చలనచిత్ర నటి
టి.జి.కమలాదేవి
టి.జి.కమలాదేవి
Tags
# cinema
# క్రీడాకారిణి
# గాయని
# టి.జి.కమలాదేవి
# స్నూకర్స్ ఛాంపియన్ షిప్
# స్నూకర్స్ ఛాంపియన్ షిప్ .చలనచిత్ర నటి
About Telugu Post
స్నూకర్స్ ఛాంపియన్ షిప్ .చలనచిత్ర నటి
Tags
cinema,
క్రీడాకారిణి,
గాయని,
టి.జి.కమలాదేవి,
స్నూకర్స్ ఛాంపియన్ షిప్,
స్నూకర్స్ ఛాంపియన్ షిప్ .చలనచిత్ర నటి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment