గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

Telugu Lo Computer
0


గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. టీటీడీ పాలకమండలి ప్రతిపాదించిన విధంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా యథాతథంగా చట్టం చేయాలని కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ టీటీడీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. గో సంరక్షణకు పతంజలి పీఠం ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన గో సమ్మేళనం చేసిన ఈ విజ్ఞప్తి వారిద్దరి చెవిలో చేరేలా గో ప్రేమికులు నినదించాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను బాబా రాందేవ్ అభినందించారు. పాలక మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టీటీడీ తలపెట్టిన గో సంరక్షణ యజ్ఞం అందరూ ముందుకు తీసుకు పోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఫోన్ చేసి గో సంరక్ష కార్యక్రమం గురించి తెలియ జేశారని రాందేవ్ బాబా వివరించారు. గోమాత సంరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రారంభించిన ఉద్యమం విశ్వవ్యాప్తం కావాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సర్వస్వతి ఆకాంక్షించారు. శ్రీవారి సంకల్పంతో ధర్మకర్తల మండలి ప్రారంభించిన గోసంరక్షణ యజ్ఞం తప్పక విజయవంతమవుతుందని ఆశీర్వదించారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ గో మహాసమ్మేళనం ముగింపు సభ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. టిటిడి ప్రారంభించిన గోసంరక్షణ ఉద్యమం సమాజ జాగృతికి దోహదపడుతుందని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను నేపాల్‌లోని ఖాట్మండు వరకు వ్యాప్తి చేయాలన్నారు. ఇందుకు ఇదే తగిన సమయమని, గోసంరక్షణ ద్వారా హిందూ ధర్మ వ్యాప్తికి టిటిడి సత్య సంకల్పంతో మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం భారతీయుల విశ్వాసాల పరిరక్షణ, దేశ సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పారు. గోవును సంరక్షించి గోసేవ చేసినపుడే దేశం సుభిక్షంగా ఉంటుందని, రాజకీయాలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశప్రజలంతా గోసంరక్షణ కోసం ఒకే తాటిమీదకు రావాలని శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సర్వస్వతి పిలుపునిచ్చారు. ప్రపంచ భవిష్యత్తు గోసంరక్షణ మీదే ఆధారపడి ఉందని, టిటిడి ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమై ఆంధ్రప్రదేశ్‌కు తగిన గౌరవం దక్కాలని ఆయన చెప్పారు. శృంగేరి శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతి స్వామి వీడియో సందేశం ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. గోసంరక్షణతోనే హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భారతదేశంలో అనేక సంప్రదాయాలు ఉన్నా, హిందూ ధర్మం గొప్పదని, సనాతన హిందూ ధర్మానికి హాని జరిగే పరిస్థితి ఏర్పడితే హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గోమాత విశిష్టతను తెలియజేస్తూ ప్రముఖ సినీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన గీతాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. సినీ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందించగా, సినీ దర్శకులు శ్రీనివాస రెడ్డి ఈ గీతాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, మారుతి ప్రసాద్‌, మొరంశెట్టి రాములు, మిలింద్ నర్వేకర్ , బోరా సౌరభ్ , యుగతులసి ఫౌండేషన్ అధ్యక్షులు శివకుమార్‌, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)