బీజేపీకి ఒవైసీ 'చిన్నాన్న': టికాయత్

Telugu Lo Computer
0



బీజేపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఒకే టీమ్ అని, బీజేపీకి ఒవైసీ 'చిన్నాన్న' (చాచా జాన్) అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ అన్నారు. వారి చర్యలను రైతులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. బాగ్‌పట్‌లో ఆయన మాట్లాడుతూ, ఒవైసీకి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. ఆయన బీజేపీని తిట్టిపోస్తుంటారని, అయినప్పటికీ ఆయనపై ఒక్క కేసు కూడా బీజేపీ పెట్టదని పేర్కొన్నారు. బీజేపీ ఆయన సాయం తీసుకుంటోందని ఆరోపించారు. రైతులు కూడా వాళ్ల చర్యలను అవగతం చేసుకోవాలని అన్నారు. ఒవైసీ రెండు ముఖాల మనిషని, రైతులను నాశనం చేస్తున్నారని, ఎన్నికల కోసం కుట్రలు పన్నుతుంటారని టికాయత్ అన్నారు. రైతుల డిమాండ్లను అంగీకరించి, మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసేంత వరకూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. అంతవరకూ తాము ఢిల్లీ సరిహద్దులు వీడే ప్రసక్తే లేదని, ఇందుకు ఎంత సమయం పట్టినా వెనుకంజ వేయమని, తుది శ్వాస వరకూ పోరాటం సాగిస్తామని చెప్పారు. రైతులంటే ఇష్టమో, కార్పొరేట్స్ అంటే ఇష్టమో వాళ్లు (కేంద్రం) తేల్చుకోవాలన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ చట్టం తీసుకువచ్చేంత వరకూ రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరదని, కార్పొరేట్లే కేంద్రాన్ని నడిపిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలపై కూడా టికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ''ఫ్యాక్టరీ వర్కర్లు ఆందోళన చేయలేరు. ఇంకెంతమాత్రం అసోసియేషన్లు పెట్టుకోలేరు. వాళ్లు ప్రతీదీ అమ్మేస్తున్నారు. మండీలు మూసేసేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)