విశ్వనాథ సత్యనారాయణ

Telugu Lo Computer
0



20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్య కావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును. విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."

విశ్వనాథ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)  కృష్ణా జిల్లా నందమూరు (ఉంగుటూరు మండలం) లో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి.  తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. శోభనాద్రి జీవితం చాలా వరకూ వైభవోపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. అనంతర కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రము, పంచె మాత్రమే సర్వవస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది. తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు, ఆయన వారణాసి వెళ్ళి గంగానదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వరస్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు. ఆయన  ప్రభావం తమపై విపరీతంగా వుందని విశ్వనాథ సత్యనారాయణ అనేకమార్లు చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ బాల్యంలో అతను పుట్టిపెరిగిన గ్రామం, దానిలో దేశికవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలూ, పురాణగాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యమూ గడిపే స్వజనమూ ఆయన కవిత్వానికి పునాదులు వేశాయని చెప్పవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ విద్యభ్యాసము ఎన్నో ఆటంకాల నడుమ సాగింది. ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. పై చదువు బందరు పట్టణంలో సాగింది. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి, పండితుడు. అతను వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్న వారు అనంతర కాలంలో మహా పండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం విశేషం. వారిలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు. చెళ్ళపిళ్ళ తమకు నిత్యం పాఠ్యప్రణాళిక ప్రకారం, సమయానికి వచ్చి పాఠాలు చెప్పినవారు కారనీ, ఐతే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో భాషా, సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ వ్రాశారు. విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు. తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్నా అతను ఈ సాహసం చేశారు. 1921 నుంచి 1926 వరకూ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మధ్యలో వదిలివేసిన బి.ఎ.ను తిరిగి 1926-27లో పూర్తిచేసి, బందరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. 


ప్రధానంగా అతను అధ్యాపక వృత్తిలో జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం, తండ్రి మరణంతో దారుణమైన పేదరికం వంటి కారణాల వల్ల అతను బి.ఎ. పూర్తికాకుండానే ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అనంతరం ఇతను వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1932లో స్వల్పకాలం) పనిచేశారు. అనంతరం దాదాపుగా ఐదారేళ్ళ పాటుగా స్థిరమైన ఉద్యోగం లేకుండా రచన, ప్రసంగాదుల ద్వారా జీవించారు. కఠోరమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొన్నా ఈ కాలంలో కవిగా అతను విఖ్యాతులయ్యారు. విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాలగా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో అతను వివిధ హోదాల్లో పనిచేసారు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ, 1958లో శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు. విశ్వనాథ సత్యనారాయణ మొదటి భార్య పేరు వరలక్ష్మి. ఆమె అపురూపమైన వ్యక్తిత్వం కల మహా మనీషిగా విశ్వనాథ తరచు పేర్కొన్నారు. వరలక్ష్మి సాహచర్యం తనకు వరమని, ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనల్లో పేర్కొన్నారు. ఆమె వాగ్మాధుర్యం, సౌందర్యం, పాతివ్రత్యం, సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు. తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి మూలం ఆమేనని పద్యరూపంగా పేర్కొన్నారు. వారికి అచ్యుతదేవరాయలు అనే కుమారుడు కలిగాడు. 1931-32 కాలంలో అతను మొదటి భార్య, తనను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఆ వియోగదు:ఖం విశ్వనాథ జీవితంపై, ఆలోచనలపై తీవ్రమైన ముద్రవేసింది. ఆయన జీవితంలో గొప్ప కుదుపు తీసుకువచ్చింది. తన జీవిన సరస్వం వంటి ఆమె మరణం వల్ల అతనులో కలిగిన వేదన తన చరమాంకంలోనూ పోలేదు. అతను 36 ఏట తొలి భార్య మరణించగా తన 80వ ఏట మరణించే సమయంలోనూ ఆమెనే తలచుకున్నారని సన్నిహితులు, కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వరలక్ష్మి మరణం పొందాకా ఆ వియోగబాధలో రోజుల తరబడి వెలువడ్డ పద్యాలను కూర్చి 20 ఏళ్ళ అనంతరం వరలక్ష్మీ త్రిశతిగా ప్రచురించారు. 300 పద్యాలున్న ఈ గ్రంథంలో వరలక్ష్మి మరణం, కర్మకాండలు మొదలుకొని స్మృతిగా మిగిలి వేదన మిగల్చడం వరకూ అనేక సందర్భాల్లో వచ్చిన పద్యాలు ఉంటాయి. తెలుగు సాహిత్యంలో నిలిచే నవలగా విమర్శకులు భావించిన విశ్వనాథ వేయిపడగలులో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణదనీ, ధర్మారావు భార్య అరుంధతి వరలక్ష్మమ్మ అని పేర్కొంటారు. ఆమె మహోన్నత్యం, సహజ పాండిత్యం, అనారోగ్యం, మరణం వంటివన్నీ ఆ నవలలోనూ వర్ణితమయ్యాయి. అతను మహాకావ్యం రామాయణ కల్పవృక్షంతో కూడా వరలక్ష్మి మరణానికి గాఢమైన సంబంధముంది. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన. అతను జీవితంపై, సాహిత్యంపై అలా వరలక్ష్మితో దాంపత్యమూ, ఆమె అకాల మరణమూ తీవ్రమైన ప్రభావం చూపించాయి.ఆయన జీవితంలో 1932 నుంచి 38 వరకూ అత్యంత కష్టదశగా చెప్పవచ్చు. ఈ సమయంలో అతను స్థిరమైన ఉద్యోగం లేకుండా జీవించాల్సిరావడంతో ఆర్థికపరమైన కష్టాలు, అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య గతించడంతో మానసికమైన దుఃఖాన్నీ అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవి ఈ దుస్తరమైన కాలంలోనే వెలువడ్డాయి. 1976 అక్టోబరు 18 న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) విశ్వనాథ పరమపదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)