మంజుల - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 11 September 2021

మంజుల


మంజుల  సినీ నటీమణి. ఈమె భర్త ప్రముఖ నటుడు విజయ కుమార్. తెలుగులో మంజుల ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా 'మాయదారి మల్లిగాడు'. హీరోయిన్‌గా ఆమెకు అది తెలుగులో తొలి సినిమా. ఈ చిత్రంతోనే ఆమె గ్లామర్ హీరోయిన్‌గా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు మంజుల. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. అందమైన చిరునవ్వు, చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన స్థానం సంపాదిచుకున్నారు. 1953, సెప్టెంబరు 9న మంజుల జన్మించారు. చెన్నయ్‌లోనే పుట్టి పెరిగిన మంజుల తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు. మంజుల, ఘట్టమనేని కృష్ణ జోడీ తెలుగులో విజయవంతమైన జంటగా పేరొందినది. 1965లో 'శాంతి నిలయం' చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కాదల్ మన్నన్ జెమినీ గణేశన్ చిన్నప్పటి పాత్రలో నటించి, తొలి చూపులో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఎంజీఆర్ నటించిన 'రిక్షాకారన్'తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తరువాత 'ఉలగం సుట్రుం వాలిబన్' చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. 1970ల్లో మంజుల హీరోయిన్‌గా అగ్రస్థాయికి చేరుకున్నారు. అయితే 80వ దశకంలో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్‌కుమార్, కమల్‌హాసన్, రజనీకాంత్ తదితరులతో కలిసి నటించారామె. ఒక రోజులోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసిన గిన్నిస్ రికార్డు తమిళచిత్రం 'స్వయంవరం'లోను ఆమె నటించారు. 'ఉన్నిడం మయంగురేన్' చిత్రీకరణలో సమయంలో విజయ్‌కుమార్, మంజుల ప్రేమలో పడ్డారు. ఆ తరువాత కొంతకాలానికే వివాహం చేసుకున్నారు. ఎంజీఆర్ దగ్గరుండి వివాహం జరిపించారు. తెలుగులో తొలిసారిగా మంజుల నటించిన చిత్రం 'జైజవాన్' (1970). ఏయన్నార్, భారతి జంటగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్ర పోషించారు. ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం 'వాడే వీడు'. ఆ తరువాత 'చాణక్య-చంద్రగుప్త' 'పల్లెటూరి చిన్నోడు', 'మనుషులంతా ఒక్కటే', 'మగాడు', 'నేరం నాది కాదు ఆకలిది', 'మా ఇద్దరి కథ' చిత్రాల్లో నటించారు. 'మనుషులంతా ఒక్కటే' చిత్రంలో ఎన్టీఆర్ నటించిన సినిమా పేర్లతో తయారైన 'నిన్నే పెళ్లాడతా.. రాముడు..భీముడు' పాట ప్రతి ఒక్కరినీ అలరించింది. అలాగే ఏయన్నార్ సరసన 'దొరబాబు', 'బంగారు బొమ్మలు', 'మహాకవి క్షేత్రయ్య' చిత్రాల్లో నటించారు. వీటిల్లో 'బంగారు బొమ్మలు' చిత్రం షూటింగ్ విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగింది. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలెండ్‌లో సెట్ వేసి 'నేనీ దరిని నువ్వా దరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' పాట చిత్రీకరించారు. 'మాయదారి మల్లిగాడు' తరువాత కృష్ణతో 'రక్తసంబంధాలు', 'దేవుడలాంటి మనిషి', 'భలే దొంగలు', 'మనుషులు చేసిన దొంగలు' చిత్రాల్లో నటించారు. ఇక కృష్ణ కెరీర్‌లో శిఖరాగ్రాన నిలిచిన 'అల్లూరి సీతారామరాజు'లోను మంజుల నటించారు. అయితే కృష్ణ సరసన కాకుండా చంద్రమోహన్ పక్కన గిరిజన యువతి రత్తి పాత్రను ఆమె పోషించారు. తెలుగులో మిగిలిన హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించినా శోభన్‌బాబు, మంజుల జంట మాత్రమే హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. జగపతి అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన 'మంచి మనుషులు' చిత్రంలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. సిమ్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్ కోసం శోభన్‌బాబు, మంజుల ప్రత్యేకంగా స్కేటింగ్ నేర్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. మరుసటి ఏడాది వచ్చిన 'అందరూ మంచివారే', 'గుణవంతుడు', 'పిచ్చిమారాజు' చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టి, వీరి కాంబినేషన్‌కి క్రేజ్ ఏర్పరచాయి. ఆ తరువాత 'ఇద్దరూ ఇద్దరే', 'మొనగాడు', 'గడుసుపిల్లోడు' చిత్రాల్లో కూడా వీరిద్దరు నటించారు. విజయకుమార్‌తో పెళ్ళి జరిగిన తరువాత సినిమాలకు దూరమయ్యారు మంజుల.వీరి ముగ్గురు అమ్మాయిలు శ్రీదేవి, రుక్మిణి ( ప్రీతి ), వనిత తెలుగు సినిమాలలో నటించారు. రాజేంద్రప్రసాద్ నటించిన 'చిక్కడు-దొరకడు' సినిమాతో తిరిగి కేరెక్టర్ నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ సినిమా తరువాత రామానాయుడు వెంకటేష్ హీరోగా నిర్మించిన 'ప్రేమ' చిత్రంలో రేవతికి తల్లిగా నెగిటివ్ పాత్రలో నటించారు. తెలుగులో ఈమె చివరి చిత్రం వాసు. వెంకటేష్ తల్లిగా ఆమె నటించారు. 2011లో తమిళంలో వచ్చిన 'ఎన్ ఉల్లమ్ తేడుదే' ఆమె చివరి చిత్రం. 2013 జూలై 23న  చెన్నైలో కన్ను మూసినది. అంతకుముందు రెండురోజుల క్రితం ప్రమాదవశాత్తూ మంచంపై నుంచి కింద పడిన మంజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చెన్నైలోని రామచంద్ర మెడికల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి కన్నుమూశారు. 

No comments:

Post a Comment