దబ్బల రాజగోపాల్

Telugu Lo Computer
0

 

దబ్బల రాజగోపాల్ (రాజ్ రెడ్డి)(Dabbala Rajagopal "Raj" Reddy) (1937 జూన్ 13) ఒక ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త, ట్యూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాలలో ఖ్యాతి గడించారు. ఆయన గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అల్ప అదాయ వర్గాల వారు, ప్రతిభావంతులైన యువకుల విద్యావసరాలను తీర్చడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ స్థాపనకు సహాయం చేశారు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ అవార్డు ఆయనకు 1994 లో వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడింది. 2001 లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం
-----------------------------
రాజ్ రెడ్డి చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం, కాటూరు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసులు రెడ్డి. తల్లి పిచ్చమ్మ గృహిణి. ఆయన తాత ఒక భూస్వామి. దాన ధర్మాల వల్ల వారి ఆస్తి కరిగిపోయింది. రాజ్ రెడ్డి తల్లి దండ్రులకు ఏడుగురు సంతానం. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. వారిలో రాజ్ రెడ్డి నాలుగోవాడు. రాజ్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన గ్రామంలోని పాఠశాలలోనే ఇసుకలో అక్షరాలు నేర్చుకున్నారు. ఐదో తరగతి దాకా అదే ఊళ్ళో చదివారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా శ్రీకాళహస్తిలో చదివారు. పదో తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవడంతో మద్రాసు లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం వచ్చింది. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలోనే చదివారు. ఇంటర్మీడియట్ లో ఆంగ్లమాధ్యమంలో చేరినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. మెల్లగా ఆంగ్లం మీద పట్టు తెచ్చుకుని ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. ప్రతిభ, మౌఖిక పరీక్ష ఆధారంగా గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు దొరికింది. 1958 లో చెన్నైలో మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం అన్నా విశ్వవిద్యాలయం) నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్నారు.
ఉద్యోగం
-----------
మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి కాగానే మద్రాసు పోర్టు ట్రస్టులో ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయన జీతం మూడు వందల రూపాయలు. ఉద్యోగం చేస్తున్నపుడే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియాలో పై చదువులకోసం దరఖాస్తు చేశారు. అలా 1960 లో ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. మాస్టర్ డిగ్రీ చేసేటపుడే కంప్యూటర్ల మీద కలిగిన ఆసక్తి వలన ఐబీయంలో ఉద్యోగంలో చేరి అక్కడే మూడేళ్ళపాటు పనిచేసి కంప్యూటర్ మెళకువలు తెలుసుకున్నారు. కంప్యూటరు గురించి మరింత పరిశోధన చేయాలన్న తపనతో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీకి దరఖాస్తు చేశారు. 1966 లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేటు సంపాదించారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మొట్టమొదటి డాక్టరేట్‌ అందుకున్న ఘనత ఆయనదే.
అదే సంవత్సరం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించారు. తరువాత పిట్స్ బర్గ్ లోని కార్నెగీ మిలాన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. అక్కడే ఆయన కెరీర్ కు బలమైన పునాది పడింది. కృత్రిమ మేధస్సు రంగం ప్రపంచాన్ని శాసిస్తుందని ఊహించి ఆ రంగం వైపు తన దృష్టి మళ్ళించారు.
బోధనా వృత్తి
------------------
రాజ్ రెడ్డి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కొద్దికాలం ఆచార్యుడిగా పనిచేశారు. తరువాత కార్నెగీ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్ ప్రొఫెసరుగా ఉన్నారు. 1960 నుండి రాజ్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఐ.బి.ఎంలో పనిచేశారు. 1969 లో ఆయన కార్నిగీ యూనివర్సిటీనందు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరారు. 1973 నుండి ఆయన పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా నియమించబడ్డారు. 1984 లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారు.
ఆయన "రోబోటిక్స్ ఇనిస్టిట్యూట్ "కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఉన్నారు. 1979 నుంచి 1991 దాకా , 1991 నుండి 1999 మధ్య కాలంలో కార్నెగీ మిలన్ యూనివర్సిటీ కంప్యూటర్ విభాగానికి డీన్ గా కూడా వ్యవహరించారు. ఆ సమయంలోనే లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్, మానవ-కంప్యూటర్ అన్యోన్యత, సెంటర్ ఫర్ ఆటోమేటెడ్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ, ఇనిస్టిట్యూట్ ఫర్ సాఫ్ట్‌వేర్ రీసర్చ్ లను ఏర్పాటు చేశారు.
ట్రిపుల్ ఐటీ సృష్టికర్త
--------------------------
అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించారు. విద్యార్థులకు ఐటీలో పరిశోధనలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తొలి ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్కు ఛైర్మన్, ఛాన్సిలర్ గా వ్యవహరించారు. రెడ్డి గారు 1999 నుండి 2001 లో యేర్పాటు చేయబడిన "ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ" (PITAC) కు సహ ఛైర్మన్ గా ఉన్నారు.
రోబోటిక్స్ లో కృషి
-------------------------
భవిష్యత్తులో మనుషులు చేయాల్సిన చాలా పనుల్ని రోబోలు చేస్తాయని ఆయన బృందం ముందుగానే ఊహించింది. ఆయన పనిచేస్తున్న విశ్వవిద్యాలయానికి ఆ రంగంపైన ఆసక్తి కలిగి దానికోసం ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా కోట్ల రూపాయల ఖర్చుతో మొట్టమొదటి రోబోటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ని నెలకొల్పి దానికి పన్నెండేళ్ల పాటు వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పటికీ ప్రపంచంలో అదే అతిపెద్ద రోబోల పరిశోధనా కేంద్రం. రోబోలకు మాటలూ, భాషలూ నేర్పించడం, పదాల్ని గుర్తుపెట్టుకునే శక్తినివ్వడం, మాటల ద్వారా ఇచ్చిన ఆదేశాలకు స్పందించడం లాంటి అనేక అంశాలను మొదట అభివృద్ధి చేసింది శాస్త్రవేత్తల బృందంలో ఆయన ముఖ్యుడు. కృత్రిమ మేధస్సులో ఆయన పరిశోధనలకు గుర్తింపుగా ఆసియాలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మక అలన్‌ ట్యూరింగ్‌ అవార్డు దక్కింది. రోబోటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ స్థాయికొచ్చాక యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌కు పదేళ్లపాటు డీన్‌గా ఉన్నత హోదాలో పనిచేశారు. అమెరికన్‌ ఆసొసియేషన్‌ ఫర్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు.
బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఐటీ సలహా సంఘానికి కో-ఛైర్మన్‌గా పనిచేశారు. ఫ్రాన్స్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం నిరుపేదలకూ సామాన్యులకూ ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాజెక్టుకు ఆయన చీఫ్‌ సైంటిస్టుగా పనిచేశారు. తక్కువ ఖర్చులోనే కంప్యూటర్లను తయారు చేసి 80వ దశకం తొలిరోజుల్లోనే ఆఫ్రికా దేశాల్లోని పాఠశాలలకు వాటిని అందేలా చూశారు. వైద్యం, రోడ్డు ప్రమాదాల నివారణ, మందుపాతర్లూ, ప్రకృతి విపత్తుల గుర్తింపు లాంటి అనేక రంగాల్లో ఉపయోగపడేలా రోబోల తయారీకి పునాది వేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మిట్టరాండ్‌ స్వయంగా అమెరికా వచ్చి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారమైన లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌ను అందించాడు.
వ్యక్తిగతం
-------------
రాజ్ రెడ్డి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నపుడు ఆయనకు తంబలపల్లి జమీందారు కుటుంబానికి చెందిన అనురాధతో పెళ్ళి కుదిరింది. పెళ్ళైన తరువాత కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయానికి మారారు. ఆయన తరఫున ఆమె భార్య వారి స్వంత గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నారు.
మూలం వికీపీడియా

Post a Comment

0Comments

Post a Comment (0)