చే గు వే రా ...!

Telugu Lo Computer
0


ఎక్కడో పుట్టి కొండలు కోనలు దాటి, హద్దులు మీటి, సరిహద్దులు దాటి గలగలా పారే జీవనది వాడు. తెలుగు నేల కడల తాకి, గుడుల తాకి, సుడులు తిరిగి కడలి చేరే కృష్ణ గోదావరిల ఏకరూపు వాడు. దుమ్మురేగిన దుక్కులను నడుమనేసి రెండు వైపులా అలుముకున్న ప్రాణం తడివాడు. కష్టమొచ్చిన, కన్నీరొచ్చినా ఆకాశం వైపు చూసే బాధను తప్పించిన ఆశల 'చె'లికాడు. చిక్కని చీకటికి రేపటిని చూపించే వెలుగుల రుజుకాడు. మానవాళి విముక్తికి విప్లవాత్మక మెడిసిన్ కావాలని కదంతొక్కిన గెరిల్లా మొనగాడు 'చే'.

నాకు గుర్తున్నంతవరకు అలాంటి ఓ అద్భుత గంభీరమైనవాడిని చూడడం అదే మొదటిసారి. అది కూడా టీ షర్ట్ పై. గుండెలమీద ధరించిన అతడి బొమ్మ చూడగానే నాకు ప్రపంచ పటం గుర్తుకు వచ్చింది. అప్పుడప్పుడే తెలివిడికి వస్తున్న నాలాంటి చాలా మందికి రెండు వేల సంవత్సరం వరకు 'చే' తెలియదు. బగ్గున మండిన బషీర్ బాగ్ ఉద్యమమో, దాని స్పూర్తితో హైదరాబాద్ వేదికగా జరిగిన ఏషియన్ సోషల్ ఫోరం సమావేశాల వల్లనో తెలీదు. అప్పటిదాక గుండె లోపల ఒదిగున్న భగత్ సింగ్ ను కలుపుకుని బయటకొచ్చిన 'చే' గుండెలమీద నుంచి దోపిడి సమాజంపై గర్జించినవాడు. ఇంగ్లీష్ బుక్స్ చదవని మాకు 'చే' డాక్టర్, క్యూబా విప్లవకారుడు, పోరాట వీరుడు అని మాత్రమే తెలుసు. అది కూడా ఎవరైనా లీడర్స్ సందర్భానుసారం ఆయన గురించిన విషయాలు తడిమితే విన్నవి తప్ప లోతుగా తెలుసుకునే అవకాశం లేదు. నిజానికి ‘చే’ ను అమెరికన్ సీఐఏ, బొలీవియా సైన్యం 1967 అక్టోబర్ 9 న అంతం చేసింది. కానీ ఆయన భౌతిక అవశేషాలను ముప్పై ఏండ్ల తర్వాత క్యూబాకు అప్పగించారు. ఆ తర్వాత 2004 జనవరి లో ది మోటర్ సైకిల్ డైరీస్ స్పానిష్ సినిమా రిలీజ్ అయింది. అది సెప్టెంబర్ లో అమెరికాతో సహా అన్ని దేశాల్లో రిలీజ్ అయింది. చరిత్రతో పాటు సినిమా ప్రభావమో, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానమో, సామాజిక మాధ్యమాల సర్క్యూలేషనో కానీ గ్లోబలైజెషన్ తో పాటే 'చే'చరిత్ర గ్లోబలైజ్ అయింది. అలా 'చే' గ్లోబలైజేషన్ తరానికీ మరింత 'చే'రువయ్యాడు.
అయినా చే ప్రేమికులకు ఇవేవి సరిపోలేదు. 'చే' ను ఇంకా తెలుసుకోవాలి. 'చే' జీవితాన్ని పోరాటాన్ని మరింతగా అర్ధం చేసుకోవాలి. మార్క్సిజం అవుట్డేటెడ్ అని దుమ్మెత్తిపోస్తున్న వేళ అవుట్స్టాండర్డని చెప్పడానికి వంద ఉదహారణలేల ఒక్క పదం 'చే' చాలన్నట్లుగా దూసుకొచ్చిన అతడి రచనల్ని చదవాలి. అని అనుకుంటున్న తెలుగునేలకు నవతెలంగాణ మాతృ సంస్థ ప్రజాశక్తి 2004 అక్టోబర్ లో "చేగువేర రచనలు" ను మోసుకొచ్చింది. మాకంటే ముందు ఎన్నోసార్లు 'చే' ను కలవరించి, పలవరించిన కలేకూరి ప్రసాద్, సఫ్ధర్ అహ్మద్, గూడిపూడి విజయరావులు తెలుగులోకి అనువదించారు. టైటిల్ ను శ్రీరాం కారంకీ సరాసరి మనస్సుల్లోకే ఎక్కుపెట్టాడు. ఇక బుక్ హౌజ్ ల్లో ఎక్కడా పుస్తకాలు ఆగలేదు. వరుసపెట్టి ఇప్పటికీ ఏడు ముద్రణలు వేశారు. ఆ తర్వాత చే జీవితం - విప్లవం- రాజకీయాలు తదితర విషయాలపై అనేక పుస్తకాలు తెలుగులో వెలువడ్డాయి. ఆ పుస్తకాల్లోని అక్షరాక్షరంలో 'చే' ను తడిమి చూసుకున్నారు. 'చే' ప్రేమలో మునిగిపోయారు. 'చే' ను చదువుతూ కన్నీటిలో తడిసిపోయారు. 'చే' తో కలిసి నడిచిపోయారు. అలా నడిచిన ఎంతో మంది విద్యార్థి యువజనోద్యమాలలో కీలకంగా పని చేశారు. విప్లవోద్యమాలను నడిపిస్తున్నారు. మీడియాలో, యూనివర్శిటీల్లో, వివిధ చోట్ల 'చే' స్నేహితుల్లా, ప్రగతిశీల కార్యకర్తల్లా, సామ్రాజ్యవాద వ్యతిరేకతతో కొనసాగుతున్నారు.
మార్క్సిస్టు భావాజాలంతో పని చేసే విద్యార్థి యువజన సంఘాల బ్యానర్స్, గ్రీటింగ్ కార్డ్స్, కాలెండర్స్, బుక్స్ లాంటి వాటి పైన భగత్ సింగ్ సరసన 'చే'రిపోయాడు మన గువేర. పెట్టుబడిదారులు 'చే' ఫోటోతోనే వ్యాపారం ప్రారంభించారు. కర్చిఫ్, టి షర్ట్, కీ చైన్, సినిమాల్లో ఇలా ఒకటేమిటి అవకాశమున్న ప్రతిదానిపైన 'చే'ను వేస్తున్నారు. బొమ్మను మాత్రమే సొమ్ము చేసుకుంటున్నాం అనుకునే వారికి తెలియకపోవచ్చు పాపం. అది ఆకర్షణీయమైన బొమ్మ కాదు తమకు దిమ్మ తిరిగేలా చేసే మార్క్సిస్టు ఊపిరికొమ్మ అని. ఇదే కాదు తనెవరో తెలియకున్నా కార్ల పై, బైక్స్ పై, మెడలో చైన్స్ గా కూడా ఎవరికి వారు 'చే' తమతో ఉండాలనుకుంటున్నారు. ఎంత విచిత్రమంటే కార్ల అద్దాలపై ఒకవైపు తమ మత చిహ్నం ఉంటే మరో వైపు 'చే' చిత్రం ఉండి తీరుతుంది. ఒకవైపు త్రివర్ణ పతాకం రెపరెపలు ఉంటే మరో వైపు 'చే' రేడియం డిజైన్ లో మెరుస్తాడు. ఒక చోట గంభీరమైన 'చే' ఉంటే, మరో చోట గన్ పట్టుకున్న 'చే' కనిపిస్తున్నాడు. ఇంకో చోట చుట్ట తాగే ఫోజులో ఉంటే వేరే చోట క్యాప్ పై మెరుస్తున్న చుక్కతో దర్శనమిస్తున్నాడు. ఇవన్ని చూస్తున్నప్పుడు ఇదేదో కేవలం స్టైల్ కోసం మాత్రం కాదని అర్ధమైతుంది. మొదట్లో స్టైల్ కోసం కావొచ్చనుకున్నాం. కానీ అది ఎలా ప్రారంభమైనా మెల్లమెల్లగా 'చే' ను తమ భావాలకు, ఆవేదనలకు, ఆవేశాలకు, ఆలోచనలకు, సమస్యల పరిష్కారాలకు ప్రతినిధిగా నిలబెట్టుకుంటున్నారని అర్ధమైతుంది. అందుకే అడవిలో క్రూర మృగాలను తరమడానికి మంటను ముట్టించి భయపెట్టినట్టు, పీడితులు కడుపు మండిన ప్రతిసారి 'చే' చిత్తరువునే జెండాగా మారుస్తూ పాలకులపైకి విసరడాన్ని వనపర్తి, వాజేడుల నుంచి వాల్ స్ట్రీట్ వరకు మనం చూశాం.
అదేంటో హైదరాబాద్ నుంచి అమెరికా దాక 'చే' ఎక్కడ జెండాలా ఎగిరినా అది ఖచ్చితంగా ఎర్రజెండా అయ్యి ఉంటుంది. అలా 'చే' ఉన్న ఎర్రజెండా ఎగరేసిన ప్రతివారు కమ్యూనిస్టులనుకుంటే పొరపాటే. కనీసం మార్క్సిజం ప్రాథమిక పాఠాలు కూడా చదివుండరు. కానీ తమ ధిక్కారానికి, డిమాండ్స్ కు, సమస్యల పరిష్కారానికి, తిరుగుబాటుకు 'చే' ను ఒక బ్రాండ్ అని నమ్ముతున్నారు. 'చే'ను ఓ దిక్సూచిలా పట్టుకుని నడుస్తున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో. లేదా నేటి జిత్తులమారి వ్యాపార పాలకులను ఎదుర్కొనేందుకు కావాలని చేస్తున్నారో.! వారి అలోచన అనార్గనైజ్డ్ గా రూపుదిద్దుకున్నదో కానీ కేపిటలిస్టిక్ స్టేట్ భాషలోనే సమాధానం చెప్పేందుకు నేటి తరం పూనుకున్నారనిపిస్తుంది. అమరుడు అరుణ్ సాగర్ చెప్పినట్టు చేగువేరాను ఫ్యాషన్ గా ఎత్తుకున్నా, పెనుగులాటలో భాగంగా స్వీకరించినా రేపైనా, మాపైనా నీ గురించి తెలుసుకోకపోడు. వన్స్ తెలుసుకున్నాక వారినెవ్వరూ అపలేరు. ఎందుకంటే 'చే' రక్తానికి ఒక బ్రాండ్. అందుకే ఎర్రెర్రని జెండాలపై ఎంబ్లం కు బదులు 'చే' ను ఎంబ్లం చేసి ఎగరేస్తున్నారు. వీరికి ఏ సైద్దాంతిక నిర్మాణ సంబంధాలు లేవు. సభ్యత్వాలు అంతకంటే లేవు. నిర్మాణం రూపముంటేనే పోరాటం మొదలెట్టాలన్న రూలేమీ లేదు. పోరాట క్రమంలో కూడా నిర్మాణం చేసుకోవచ్చు అన్నది నేడు కనిపిస్తున్న పద్దతి. ఇదే 'చే' ఆనాడే "సోషలిజం అండ్ మ్యాన్ ఇన్ క్యూబా" ఆర్టికల్ లో నిర్ధిష్ట పరిస్థితుల నేపధ్యంగా సోషలిస్టు నిర్మాణ క్రమం ఉండాలని చెప్పాడు.
అయినా చరిత్రకు దారి చూపి మలుపు తిప్పాల్సిన వారు తిప్పనప్పుడు చరిత్ర తనకు తానే మలుపు తీసుకోవడంలో భాగమే ఇదంతా కావచ్చు. ఇలా 'చే' నిండిన ఎర్రజెండాల రెపరెపలు చూసినప్పుడు మార్క్స్ చెప్పినట్టు ఆ మలుపు వెనక్కి కాకుండా ముందుకే పోతుందనిపిస్తుంది. అంతే తప్ప ఇదేం వ్యక్తి పూజ కాదు. వ్యక్తులే ఒక ఐడియాలజీకి ఐకాన్ గా మారిపోయాక ప్రతి స్మరణా, ప్రతి నివాళీ, ప్రతి పాట ఒక సంకల్పమే. అందుకే తెలుగు నేల 'చే' స్మరణలో ఎన్నో పాటలల్లుకున్నది. "చేగువేర చేగువేర లాటిన్ అమెరికా ధృవతార" అంటూ విమలక్క పాడితే, "జోహారు జోహారు జోహారులయ్యో చేగువేరా" అని జానపదులు గొంతెత్తారు. " చేగువేరా అగ్ని కణమే నువ్వు, చేగువేరా ప్రేమ గుణమే నువ్వు" అంటూ విజయవాడ రాజేష్ వెస్ట్రన్ లో ఆలపించాడు. ఇప్పటిదాక అన్ని సినిమాల్లో 'చే' ఇమేజ్ వాడుకున్నారు. తెలుగు సినిమా సూర్యాస్తమయంలో బండి సరోజ్ కుమార్ మాత్రం చేగెవారా ఎంత గొప్ప పోరాట వీరుడో వివరించాడు. 'చే' 1928 జూన్ 14 న అర్జెంటీనా లోనీ రోసారియో పట్టణంలో జన్మించి డాక్టర్ చదివినవాడు. మోటార్ సైకిల్ లాపోడరేసా పై ఆరు దేశాలు తిరిగి ప్రజలతో మమేకమై ప్రపంచ పౌరుడైన సాహస యోధుడు. క్యూబా సోషలిస్టు నిర్మాణంలో ముఖ్యుడు, ఫైడల్ కాస్ట్రో స్నేహితుడు. మంత్రి పదవి కంటే మానవాళి విముక్తియే కిలకమని తలచి బోలివియా విముక్తికి గెరిల్లా యుద్దం చేస్తూ ప్రాణాలొదిలిన 39 ఏండ్ల నిత్య రివల్యూషనరీ 'చేగువేరా'.
ఆయన మార్గంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ) రాజీలేకుండా పనిచేస్తుంది. సామ్రాజ్యవాద, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే కాదు, ఉద్యమ గమనంలో స్థానిక పరిస్థితులను, సమకాలిన పరిణామాలను ఆకళింపు చేసుకుని మార్క్సిజాన్ని అన్వయించాలన్నటువంటి 'చే' స్పూర్తి కొనసాగింపుకు మరింత ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రూట్స్ లోకి వెళ్ళి ప్రజ స్థితిగతుల్ని తెలుసుకునేందుకు పలుమార్లు, మిక్కిలి రోజులు మోటార్ సైకిల్ యాత్రలు చేసింది. తెలంగాణ నిరుద్యోగ నిజ లెక్కల్ని ఎప్పటికప్పుడు జనం ముందు పెడుతూ కొలువులకోసం ధర్నాలు, నిరాహారదీక్షల్లాంటీ ఎన్నో ఉద్యమాలను నిర్వహించింది. యువజన సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా, సినిమా, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంది. వాటిల్లోని సమస్యలను వెలికితీసి పోరాడుతుంది. భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలిగిస్తూ ధర్నా చౌక్ ఎత్తివేతను నిరసిస్తూ జరిగిన పోరాటంలో ముందున్నది. ఇంటర్మీడియట్ పరీక్షల అవకతవకల వలన విద్యార్థుల ఆత్మహత్యలను చూడలేక బోర్డును ముట్టడించి నిరవధిక నిరాహార దీక్షకు దిగింది. అనేక ప్రజా సమస్యల్ని ప్రపంచం ముందుంచి పరిష్కారానికి కొట్లాడుతున్నది. ప్రజల్ని గొర్రెలను చేసి పాలిస్తున్న దోపిడి పాలకుల మీద ఎంత ద్వేషంతో పోరాడుతుందో ప్రేమలను అంతే స్థాయిలో గౌరవిస్తుంది. లెక్కకు మిక్కిలి ప్రేమ వివాహాలు జరగాలని కోరుకుంటూ ప్రేమ వేదికల్ని నడుపుతూ, వందలాది ప్రేమ వివాహాల్ని జరిపిస్తుంది. ప్రేమికుల స్వేచ్చను హరిస్తూ వారిమీద దాడులు చేస్తున్న మత సంస్థలకు బుద్ది చెప్తుంది. ప్రేమ పేరుతో జరిగే అన్ని రకాల దాడులను నిలదీస్తూ, పరువు పేరుతో జరిగే హత్యాకాండపై నికరంగా పోరాడుతుంది.
నల్లమల్ల అడవిలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడి నోరులేని చెంచుల గొంతై నిలిచింది. తెలుగు ప్రజలకు అత్యధిక ఆక్సీజన్ అందిస్తున్న అటవి రక్షణకోసం, ఆదివాసులకోసం, రెండు తెలుగు రాష్ట్రాలకు గుండెకాయలైన సాగు, తాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ లను కాపాడడం కోసం రెండున్నర లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతికి పంపించింది. ఈ సమస్యపై తెలుగు సినిమా రంగాన్ని సంప్రదించి ఉద్యమానికి మద్దతుగా సంతకాలు చేయించింది. ఈ కాలంలో మొట్టమొదటిసారి ఒక సామాజిక సమస్యపై తెలుగు సినిమా రంగం స్పందించి బహిరంగ ప్రకటనలిచ్చింది. నల్లమల మోటార్ సైకిల్ యాత్ర పేరుతో ఊరూరు తిరిగి ప్రజలను, యువతను కదిలించి డిల్లీ పార్లమెంట్ వీధుల్లో నినదించింది డివైఎఫ్ఐ. నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు పట్టు వదలక పోరాడింది. వైద్యాన్ని సామాన్యుడికి నైవేధ్యంగా మార్చి, ఎంతో మంది చావులకు కారణమైన హాస్పిటల్స్ దోపిడిని ఎండగడుతూ బ్యాన్ కార్పోరేట్ హాస్పిటల్స్ బ్యాన్ యశోదా ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. మరో వైపు ప్రభుత్వ హాస్పిటల్స్ పటిష్టతకోసం సేవ్ ఉస్మానియా, గాందీ, ఎంజిఎం అంటూ జిల్లా కేంద్రాస్పత్రులను బలోపేతం చేయాలని అనేక పోరాటాలు నిర్వహిస్తుంది.
1967 అక్టోబర్ 18 న హవాన లోని పలాజా డీలా రివల్యూషన్ దగ్గర 'చే' సంస్మరణ సభకు హాజరైన లక్షలాది ప్రజల్ని ఉద్దేశించి ఫైడెల్ కాస్ట్రో చెప్పిన విషయం ప్రతి సందర్భంలో రుజువవుతున్నది. దాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. "మా బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నామని ఏవరైనా తెలుసుకోవాలనుకుంటే మా విప్లవ హృదాంతరాళంతో గర్వంగా చెప్తాం. 'చే' లా జీవించాలని కోరుకుంటున్నామని." ఇది అక్షరాల నిజం. కరోనా కాలంలో ప్రపంచమంతా గడియలు బిగించుకుని భయపడి కూర్చుంటే ప్రపంచంలో ప్రతీ దేశానికి డాక్టర్స్ ను పంపి సేవలు అందించిన ఏకైక దేశం క్యూబా. అలా 'చే' తో డివైఎఫ్ఐ కూడా నడుస్తుంది. మొదటిసారి లాక్ డౌన్ లో మనిషిని మరో మనిషి కరోనా వైరస్ లాగ చూసిన ఆ భయస్థితిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు, వలస కార్మికులకు, యాచకులకు భోజనం పెట్టేందుకు ఇరవైనాలుగు కిచెన్ లు నడిపింది. మరెన్నో చోట్ల వాటర్ బాటిల్స్, స్నాక్స్, కూరగాయలు, గుడ్లు సరఫరా చేసింది. రక్తదాన శిభిరాలు నిర్వహించింది. ఆ క్రమంలో హైదరాబాద్ లో అకస్మాత్తుగా వచ్చిన వర్షాలకు చార్మినార్, పాతబస్తీ ప్రాంతంలో నీట మునిగిన ఇళ్ళనుంచి ప్రజలను కాపాడి భోజన సదుపాయాలు కల్పించి ప్రభుత్వాలకే డివైఎఫ్ఐ మార్గదర్శకంగా నిలిచింది. సెకండ్ వేవ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా హెల్ప్ లైన్ సెంటర్స్, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ఐసొలేషన్ సెంటర్ తో పాటు ఖమ్మం, నల్లగొండల్లాంటి జిల్లాల్లో కూడా సిపిఎం తో కలిసి కీలకంగా పనిచేస్తుంది. అంతేగాకుండా అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యక్రమాలనూ నిర్వహించింది.
సామ్రాజ్యవాదం పై ఏ దేశం విజయం సాధించినా మన విజయమే. ఏ దేశం ఓడిన మన ఓటమే. సామ్రాజ్యవాదం పై పోరులో తృతీయ ప్రపంచ దేశాల ఐక్యత అనివార్యమంటాడు 'చే'. ఆయన పుట్టి నేటికి 93 ఏండ్లవుతుంది. సరిగ్గా ఈ కాలంలోనే అమెరికా అండతో పాలస్తీనా పై ఇజ్రాయిల్ మరోసారి దాడులకు తెగబడింది. ఎంతో మంది ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలు తీస్తుంది. అయినా మన దేశ ప్రభుత్వానికి ఎలాంటి అంతర్జాతీయ సహృద్భావం లేదు. ఎంతో కాలంగా ఇండియాకు పాలస్తీనాకు ఉన్న స్నేహాన్ని పక్కనబెట్టిన బిజెపి పాలకులు ఇజ్రాయెల్ తో అంటకాగుతూ నెత్తుటి చేతులకు చేతులు కలపడం మోడీ పాలక నరహంతక బుద్ధిని తెలియజేస్తుంది. ఇండియా ప్రజలు పాలస్తీనతో ఉంటే భారత పాలకులు ఇజ్రాయెల్ తో ఉన్నారనేది సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తిన స్టాండ్ విత్ పాలస్తీన హ్యాష్ టాగ్ చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.
'చే' చెప్పినట్లు పాలస్తీన ఓటమి మనందరి ఓటమి అవుతుంది. కనుక మనమంతా ఆయన పుట్టిన రోజున పాలస్తీన వర్ధిల్లాలని కోరుకోవాలి. అమెరిక సామ్రాజ్యవాద దోపిడి, ఇజ్రాయెల్ దురాక్రమణ నశించాలని నినదించాలి. బరితెగించిన భారత పాలకుల మత విధానం పై పోరాడాలి. శ్రామికుల మధ్య ఉండే అంతర్జాతీయతకు దన్నుగా నిలబడాలి. కరోనా నుంచి ప్రజలను రక్షించలేని, కాటిలో కూడా చోటివ్వలేని, స్మశాన రాజ్యంగా మార్చి మాన్ కీ బాత్ అంటూ మాయ ముచ్చట్లు చెప్తున్న ప్రధానిని చూస్తే కనీసం ఉమ్ముకూడా రావడం లేదు. అలాంటి నెత్తురు తాగమరిగిన ఫాసిస్టు పాలనపై నదినాశ్రయించిన మృతదేహాల సాక్షిగా తిరగబడాలి. మానవత్వం లౌకికత్వం కలిగిన మనదేశంలో పాలకులు నూరిపోస్తున్న మతతత్వ కంపును పారదోలేందుకు మనకు 'చే' లు పూయాలి, 'చే' లు కాయాలి. ఇది ఇప్పుడు చాలా అవసరం.
ఎందుకంటే యావత్ మానవాళి ప్రేమికుడు 'చే'. లవ్ అనే మాటకు రూపం ఉంటే అది 'చే'. స్నేహం అనే పదానికి ప్రాణం పోసుకుని నడిచొస్తే అదే 'చే'. బార్డర్స్ లేని భగభగ మండే భాస్వరం అతడు. ఆర్డర్స్ లేని అలల స్వేచ్చా కల అతడు. మోకాళ్ళ మీద నడుస్తూ బ్రతకడంకంటే నిటారుగా నిలబడి వీరుడిలా మరణించడమే మేలని బానిస బుద్ధుల బద్దలు కొట్టి తన ఊపిరి తీసి సూర్యుడికే ఊపిరిపోసిన నేటి తూర్పుదిక్కు తల్లివేరు చేగువేరా. అందుకే మనం దేహమైతే తను ప్రాణమై పలకరిస్తాడు. మనం ప్రాణమైతే తను గానమై వినిపిస్తాడు. మోదుగుపూల వనమై వికసిస్తాడు. తన దేహం కాల్చబడినా సరే తను గాలిలో కలిసి అణువై, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లై మనందరిలో నిండిపోయాడు. హిమోగ్లోబిన్ గుణమై, సిరలు ధమనుల జలమై, జఠరిక కర్ణికల బలమై, మొలకెత్తే రేపటి తనమై, శిరమెత్తిన పిడికిలి పొగరై నినదిస్తూ కనిపిస్తాడు. ఆయన స్పూర్తితో యువతరం స్వేచ్చా తరంగమై ఎగిసిపడాలి. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తూ, చర్చిస్తూ ఎప్పటికప్పుడు అభిప్రాయాలు కలబోసుకుంటూ, కార్యశీలురై కదనరంగంలోకి కదం తొక్కాలి. లెట్స్ గో డ్యూడ్ మానవాళి కోసం ప్రేమై చిగురించే, ప్రేమై వికసించే, ప్రేమై వర్షించే వందలాది మంది 'చే'లు కావాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)