వైద్య రంగానికి రూ. 50 వేల కోట్లు

Telugu Lo Computer
0


కరోనా సెకండ్‌ వేవ్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు గత మేలో ఆత్మనిర్భర భారత్‌ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా వైద్య వసతులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రంగంలో మౌలిక సౌకర్యాలకు మరింత ఊతమిచ్చేందుకు ఆర్థికశాఖ పలు కీలక చర్యలు చేపట్టింది.

కొవిడ్‌ కష్ట కాలంలో దేశ ఆర్థిక రంగం గాడి తప్పకుండా కేంద్రం ఇప్పటి వరకు పలు దఫాలు ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తూ వచ్చింది. తాజాగా కరోనా మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పటిష్ఠ సన్నద్ధత నిమిత్తం వైద్యారోగ్య సంరక్షణ వ్యవస్థల మెరుగే ప్రధాన లక్ష్యంగా తాజా ప్యాకేజీని ప్రకటించింది. కొవిడ్‌ సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలు అందించిన ఆర్థిక ఉద్దీపనల విలువ రూ.30 లక్షల కోట్లు దాటిందని అంచనా.

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ, కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ, వైద్య రంగానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల  కేటాయింపు, వైద్య, ఆరోగ్యశాఖకు సాయం చేసే సంస్థలకు అండ,  వైద్య, ఔషధ రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కొత్త ప్రాజెక్టులకు రుణం, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌(ఈసీఎల్‌జీఎస్‌) కింద అత్యవసర రుణాలకు అదనంగా మరో రూ.1.5 లక్షల కోట్లు. వీటిని అవసరాన్ని బట్టి వివిధ రంగాలకు కేటాయిస్తారు, ఈసీఎల్‌జీఎస్‌లో భాగంగా సూక్ష్మరుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల రుణం. దీనికి వడ్డీ గరిష్ఠంగా ఎంసీఎల్‌ఆర్‌+2శాతం. కాలవ్యవధి మూడు సంవత్సరాలు, పర్యాటక రంగంపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు ట్రావెల్‌ ఏజెన్సీలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ.10 లక్షల వరకు.. టూరిస్ట్‌ గైడ్‌లకు రూ.1 లక్ష వరకు వ్యక్తిగత రుణం, రిజిస్టర్‌ చేసుకున్న టూరిస్ట్‌ గైడ్‌లు, పర్యాటక రంగంపై ఆధారపడిన 11,000 మందికి ఆర్థిక సాయం, సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు తనఖా లేకుండా రుణం, తొలి ఐదు లక్షల మందికి ఉచిత టూరిస్ట్‌ వీసాలు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది, ఆత్మనిర్భర్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు, కృత్రిమ ఎరువులకు రూ.14,775 కోట్ల మేర అదనపు రాయితీలు. డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు,  ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మే నుంచి నవంబరు వరకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితం, చిన్నారులు, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం కోసం రూ.23,220 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ, పునరుద్ధరణ నిమిత్తం ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌కు 77.45 కోట్ల నిధులు, ఈశాన్య ప్రాంతంలోని రైతులకు తమ పంట ఉత్పత్తులపై 10-15 శాతం అదనపు పరిహారం, ఎగుమతుల బీమాను రూ.88వేల కోట్ల వరకు పెంచేందుకు వీలుగా ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌(ఈసీజీసీ)కి ప్రభుత్వ నిధులు, నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ కింద ప్రాజెక్టుల ఎగుమతులకు రూ.33 వేల కోట్ల అదనపు నిధులు,  ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సేవల్ని అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారత్‌నెట్‌ కార్యక్రమానికి రూ.19,041 కోట్ల అదనపు నిధులు, భారీ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) కాల వ్యవధి మరో ఏడాది పొడిగింపు.


Post a Comment

0Comments

Post a Comment (0)