కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ !

Telugu Lo Computer
0


రోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ, రమేష్‌ గుప్తాలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా తీర్పుని సోమవారానికి రిజర్వ్‌ చేశారు. తీవ్రమైన మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు.. అలాగే ఇన్సులిన్‌ను ఎక్కించేందుకు జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జైలులో కేజ్రీవాల్‌ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి బదులుగా డైట్‌ విషయంలో ఇడి రాజకీయం చేస్తోందని వాదించారు. ఖైదీ అయినంత మాత్రాన గౌరవప్రదమైన జీవితం, మంచి ఆరోగ్యంపొందే హక్కులేదా అని ప్రశ్నించారు. వ్యక్తిగత వైద్యునితో వీడియో కాన్ఫరెన్స్‌లో 15 నిమిషాల పాటు మాట్లాడేందుకు అనుమతించలేని గ్యాంగ్‌స్టరా అని ప్రశ్నించారు. బెయిల్‌ పొందేందుకు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను పెంచుకుంటున్నట్లు ఇడి ఆరోపించిందని, అరెస్ట్‌కు ముందు వైద్యుడు సూచించిన డైట్‌ ప్రకారమే కేజ్రీవాల్‌ ఆహారం తీసుకుంటున్నారని అభిషేక్‌ సింఘ్వీ పేర్కొన్నారు. డైట్‌ చార్ట్‌ ప్రకారమే కేజ్రీవాల్‌కు ఫుడ్‌ అనుమతి ఇస్తున్నట్లు జైలు తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. షుగర్‌ లెవెల్స్‌ జైలు డాక్టర్లు ఎప్పటికప్పడు మానిటరింగ్‌ చేస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. షుగర్‌ లెవెల్స్‌ మెయింటెన్స్‌ అవుతున్నాయని వెల్లడించారు. ఎయిమ్స్‌ నివేదిక ప్రకారం మ్యాంగో, బనానాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలు షుగర్‌ ఉన్నవారు తీసుకోవద్దని జైలు తరపు లాయర్‌ పేర్కొన్నారు. అవసరం అయితే జైల్లో ఇన్సులిన్‌ కూడా ఇస్తామని పేర్కొన్నారు.కేజ్రీవాల్‌ జైల్లో మామిడి పండ్లు, తీపి పదార్థాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మెడికల్‌ బెయిల్‌ పొందేందుకే ఇలా చేస్తున్నారని ఇడి గురువారం ఆరోపించిన సంగతి తెలిసిందే.లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మార్చి 21న ఇడి అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు రెండు సార్లు ఇడి కస్టడీకి అనుమతిచ్చింది. తర్వాత ఏప్రిల్‌ 1న కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఇడి అధికారులు తీహార్‌ జైలుకు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)