కేసీఆర్, మోడీ పాలమూరుకు చేసిందేమీ లేదు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లు రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ  పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. నాడు పలుగు, పారాబట్టి పాలమూరు నుంచి వలసలు పోయేవారని చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గెలిపించారని, గెలిపిస్తే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో కేసీఆర్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని నిలదీశారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సహకరించలేదన్నారు. పరిశ్రమలను జిల్లాకు తీసుకురాలేదని,కానీ మళ్లీ కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పార్లమెంట్‌లో పాలమూరు గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. తాజాగా జరిగిన సెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును బొంద తీసి పాతి పెట్టారని ఎద్దేవా చేశారు. కారును తూకం పెట్టి అమ్ముడేనని సెటైర్లు గుప్పించారు. రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ అని, ముట్టుకుంటే మాడి పోతారని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వమని, స్వయం సహాయక బృందాలతో మహిళా సంఘాలను ఆదుకున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డ నాయకుడై దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ఠ పెంచారని అన్నారు. కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు నిధులను తీసుకువచ్చి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ దొరలు - గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరుకి ఇప్పుడు సువర్ణ అవకాశమొచ్చిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత తమదని తెలిపారు. పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించాలని.. జిల్లాలను మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్దించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)