భారత్‌లో ప్రజాస్వామ్యానికే ముప్పు : ' ది ఎకనమిస్ట్‌ '

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు అంతర్జాతీయంగా కూడా వ్యక్తమవుతున్నాయి. మోడీ  సర్కారు మతోన్మాద పాలనపై లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత మ్యాగజైన్‌ ' ది ఎకనమిస్ట్‌ ' పూర్తి వివరణ ఇస్తూ తీవ్ర విమర్శలు చేసింది. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ మోడీ  సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు తలెత్తనుందని హెచ్చరించింది. సహనశీల, భిన్నమతాలకు నిలయమైన భారత్‌ను హిందూ దేశంగా మార్చడానికి ప్రధాని మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ' ది ఎకనమిస్ట్‌ ' మ్యాగజైన్‌ వ్యాఖ్యానించింది. భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యంలో బిజెపి ప్రభుత్వ విధానాలపై సమీక్ష చేస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. మోడీ ప్రభుత్వ విధానాలు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడతాయేమో కానీ, దేశానికి అవి ' రాజకీయ విషం ' గా మారుతాయని ఆరోపించింది. సిఎఎ, తదితర మోడీ విధానాలు రక్తపాతానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. మతం, జాతీయత గుర్తింపుపై విభజన తీసుకురావడం, ముస్లింలు ప్రమాదకరమంటూ పదేపదే పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ తన మద్దతుదారులను పెంచుకోవడంలోనూ, దేశ దుస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలోనూ బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తుందని వివరించింది. ప్రతిపాదిత 'జాతీయ పౌర జాబితా ' (ఎన్‌ఆర్‌సి) కాషాయ పార్టీ విభజన ఎజెండాకు మరింత దోహదపడనుందని తెలిపింది. ఈక్రమంలో మోడి దేశంలో 80 శాతం ఉన్న హిందువులకు రక్షకుడిగా తనను తాను చూపించుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిరంతరం ఒక వర్గాన్ని పీడించడం అందరికీ ముప్పు గా మారుతుందని, రాజకీయ వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించింది. హిందువులను రెచ్చగొట్టడం, ముస్లింలను ఆగ్రహానికి గురిచేయడం ద్వారా బిజెపి కొత్తగా రక్తపాతానికి తెరలేపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  దావోస్‌లో ' ప్రపంచ ఆర్థిక వేదిక ' సదస్సులో అమెరికాకు చెందిన ప్రముఖ దాత, పెట్టుబడిదారుడు జార్జ్‌ సొరోస్‌ మోడి విధానాలపై గళం విప్పారు. భారత్‌లో జాతీయవాదం పడగ విప్పుతున్నదని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోడి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే విధానాలపై నిప్పులుచెరిగారు. భారత్‌లో కాశ్మీర్‌ పై కఠిన ఆంక్షలు విధించారనీ, లక్షలాదిమంది ముస్లింల పౌరసత్వం లాగేసుకుంటామని బెదిరిస్తున్నారనీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై పోకడలపై కూడా సొరోస్‌ విమర్శలు గుప్పించారు. ఆయన ప్రపంచం మొత్తం తన చుట్టూనే తిరగాలని కోరుకుంటారనీ, రాజ్యాంగ పరిధులను ఆయన అతిక్రమించారని, ఇప్పుడు అభిశంసనను ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)