డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటిలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుతో పాటుగా విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఈసీ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఇద్దరినీ తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, ఇద్దరిని ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. ఇద్దరు అధికారులకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ చేసిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై ఈసీకి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల వ్యవహారశైలిపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తోపాటు కొందరు టీడీపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యాలతోపాటు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ప్రయత్నించారు. ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు భారీగా నగదు తీసుకున్నారు. చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకు కూడా సీతారామాంజనేయులు బాధ్యులుగా ఉన్నారని పురంధేశ్వరి ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేగాక, మూడేళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా కొనసాగుతున్న ఆయన అపరిమిత అధికారాలు ఉపయోగించుకుని విపక్ష నేతలను వేధిస్తున్నారని పురంధేశ్వరి తెలిపారు. మరోవైపు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా.. వైసీపీతో అంటకాగుతూ చిన్నా చితకా కారణాలకు కూడా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలమేరకే సీపీ నడుచుకుంటున్నారని పురంధేశ్వరి ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఇటీవల సీఎం జగన్ పై రాయిదాడి ఘటనకు సంబంధించి కూడా కాంతిరాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)