భారతీయుడి తలపై రూ.2 కోట్ల రివార్డు ప్రకటించిన ఎఫ్బీఐ !

Telugu Lo Computer
0


భారత్‌ కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో 2015 ఏప్రిల్‌ 12న తన భార్యను అత్యంత కిరాతంగా కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడైన భద్రేశ్‌ కుమార్‌ చేతన్‌భాయ్‌ పటేల్‌ను అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లకు పైమాటే) ఇస్తామని వెల్లడించింది. భద్రేశ్ పటేల్‌, అతడి భార్య పాలక్‌ స్థానికంగా ఉండే ఓ డోనట్‌ దుకాణంలో పని చేసేవారు. హత్య జరిగిన రోజున వీరిద్దరూ నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణంలోని కిచెన్‌లో పనిచేస్తున్న పాలక్‌ దగ్గరకు అతడు వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎఫ్‌బీఐ అధికారులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. హత్య అనంతరం తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన భద్రేశ్‌ కొన్ని వస్తువులు తీసుకుని న్యూజెర్సీ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించింది. ఆ తర్వాత అతడి జాడలేదు. అప్పటినుంచి నిందితుడి కోసం గాలిస్తున్న ఎఫ్‌బీఐ.. 2017లో అతడిని టాప్‌టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా రివార్డు ప్రకటించింది. వీసా గడువు తీరడంతో పాలక్‌ భారత్‌ తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుందట. ఇది నచ్చని ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. నిందితుడు భద్రేశ్‌ కెనడా పారిపోయి ఉంటాడని లేదా భారత్‌కు తిరిగి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)