అధ్యక్ష అభ్యర్థిత్వ బరి నుంచి నిక్కీ హేలీ ఔట్‌ ?

Telugu Lo Computer
0

మెరికా అధికార పీఠం కోసం జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యర్థులుగా ఉండటం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగాలని భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై ఆమె ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. మంగళవారం జరిగిన 'సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల' పోరులో ఈమె దారుణంగా ఓడిపోయారు. రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. నేటి ఫలితాల తర్వాత ట్రంప్‌నకు 995 మంది మద్దతు ఉండగా.. హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. ట్రంప్‌తో పోలిస్తే భారీ వెనుకంజలో ఉన్న ఆమె.. పోటీని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ప్రైమరీ ఎన్నికల్లో ఆయనకు పోటీగా.. హేలీ, వివేక్‌ రామస్వామితో పాటు డజను మందికి పైగా బరిలోకి దిగారు. అయితే, ప్రైమరీలు మొదలైన నాటినుంచే మాజీ అధ్యక్షుడు ఆధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రధాన పోటీదారులు వరుసగా రేసు నుంచి వైదొలిగారు. చివరగా మిగిలిన హేలీ కూడా పోటీని విరమించుకునేందుకు సిద్ధమవడంతో అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ పోటీ ఖాయం కానుంది. అటు డెమోక్రాట్ల తరఫున బైడెన్‌ ముందంజలోనే ఉన్నారు. అయితే, లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్‌ పొందడానికి ట్రంప్‌ ఈనెల 12 వరకు, బైడెన్‌ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)