కాంగ్రెస్‌ పార్టీ పిటిషన్‌ ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు !

Telugu Lo Computer
0


తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్‌ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బ్యాంక్‌ అకౌంట్లను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఫ్రీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌ సవాల్‌ చేసింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌లు యశ్వంత్‌ వర్మ, పురుషేంద్ర కుమార్‌ కౌరవల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని, పార్టీ ఎగ్గొ ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్‌ రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది. అయితే తొలుత ఈ పిటిషన్లపై మార్చి 20న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి నేడు తీర్పు వెల్లడించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. కాగా అంతకుముందు ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. 2018-19 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీ శాఖ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ నోటీసుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ.. స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇక తమ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్‌ అగ్రనేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అబద్దంగా మారిందని ఆరోపిన్నారు. ఎన్నికల్లో పోరాడకుంటా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాటి చర్యలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ న్యాయస్థానంలోనూ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)