ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఏప్రిల్ 1కి వాయిదా !

Telugu Lo Computer
0


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం రుణ గ్రహీతలకు పీనల్‌ ఇంట్రస్ట్‌ విధించే బదులు, పీనల్‌ ఛార్జెస్‌ వర్తిస్తాయి. ఈ ఛార్జీలు ఎటువంటి అదనపు వడ్డీని కలిగి ఉండవు. రుణగ్రహీతలకు మేలు చేసేలా పెనాల్టీ స్ట్రక్చర్‌ క్రమబద్దీకరించడం, సరళీకృతం చేయడం లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పెనాల్టీ ఛార్జీలు ప్రవేశపెట్టడానికి కారణం రుణగ్రహీతలు తమ రుణాలను తిరిగి చెల్లించే విషయంలో మరింత బాధ్యతగా, క్రమశిక్షణతో ఉండేలా ప్రోత్సహించడమే. ఈ ఛార్జీలు బ్యాంకులు లోన్‌ అగ్రిమెంట్‌లో రుణ గ్రహీత ఇప్పటికే అంగీకరించిన వడ్డీ రేటుపై అదనపు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం కాకూడదని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. రుణగ్రహీతలపై ఆర్థికంగా అధిక భారం పడకుండా, లోన్‌ రీపేమెంట్‌ బాధ్యతలను తీవ్రంగా పరిగణించేలా ఈ విధానం రూపొందింది. కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని నిర్ణయించారు. అయితే ఆర్బీఐ 2023 డిసెంబర్ 29 నాటి సర్క్యులర్ ద్వారా అమలును మరో మూడు నెలలు, అంటే 2024 ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. తర్వాత సరైన సమయానికి లోన్ తిరిగి చెల్లించలేక డిఫాల్ట్‌గా మారిన రుణ గ్రహీతలపై ఈ కొత్త పెనాల్టీ ఛార్జీలను విధిస్తారు. ఇప్పటికే ఉన్న లోన్ల విషయంలో కొత్త పీనల్ ఛార్జీలు విధించే విధానం 2024 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత వచ్చే రెన్యువల్‌ డేట్‌లో జరుగుతుంది. కానీ 2024 జూన్ 30 కంటే ముందే ఉంటుంది. మెటీరియల్ టర్మ్స్‌, కండిషన్స్‌ బ్యాంక్ క్రెడిట్ పాలసీ ప్రకారం, లోన్‌ కేటగిరీ ప్రకారం మారుతాయి. ఇవి బ్యాంకులను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఉన్న పీనల్ ఛార్జీలపై అదనపు ఛార్జీలు విధించరు. ఈ నియమాలు బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ, క్యాష్‌ క్రెడిట్‌కి వర్తిస్తాయి. సర్క్యులర్ ప్రకారం ప్రత్యేకంగా మినహాయింపు పొందిన వాటికి తప్ప, అన్ని క్రెడిట్ ఫెసిలిటీలకు సూచనలు వర్తిస్తాయి. సెక్యూరిటైజేషన్, కో-లెండింగ్ పోర్ట్‌ఫోలియోలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయి. పీనల్ ఛార్జీలకు గరిష్ట పరిమితి లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు తమ పాలసీని రూపొందిస్తున్నప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటాయి. ఈ ఛార్జీలు విధించడం వెనుక ఉద్దేశం క్రెడిట్ డిసిప్లైన్‌ పెంపొందించడమే తప్ప తమ ఆదాయాన్ని పెంచుకోవడం కాదని ఆర్థిక సంస్థలు గుర్తుంచుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)