తనను 'ఆదరణీయ', 'శ్రీ' మోడీ అంటూ సంబోధించవద్దు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తనను 'ఆదరణీయ' లేదా 'శ్రీ' మోడీ అంటూ సంబోధించవద్దని ప్రధాని మోడీ గురువారం తన సహచర ఎంపీలకు సూచించారు. తన పేరుకు ఇలాంటి గౌరవ వాచకాలు జోడిస్తే ప్రజలకు తనకూ మధ్య దూరం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పార్టీలో ఓ సాధారణ కార్యకర్తనని, ప్రజలు తనను తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారని చెప్పారని మీటింగ్‌లో పాల్గొన్న కొందరు ఎంపీలు మీడియాకు వివరించారు. తనను ఎంపీలు తమలో ఒకడిగా భావించాలని సూచించినట్టు పేర్కొన్నారు. ''నేను పార్టీలో ఓ చిన్న కార్యకర్తను. సామాన్యులు నన్ను తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తారు. కాబట్టి 'శ్రీ', 'ఆదరణీయ' లాంటి విశేషణాలు నా పేరుకు ముందు చేర్చకండి'' అని మోడీ  పేర్కొన్నట్టు ఎంపీలు వెల్లడించారు. మనమందరం ఒకటే జట్టు అన్న భావన పార్టీలో నెలకొన్న కారణంగానే ఇటీవల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని మోడీ తెలిపారు. ఎంపీలు కూడా ఇదే స్ఫూర్తితో ఉమ్మడిగా ముందడుగు వేయాలని సూచించారు. కాగా, ప్రభుత్వ పాలనా విధానాల కారణంగానే బీజేపీ అందరికీ దగ్గరైందని ప్రధాని అన్నట్టు సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. సుపరిపాలనా అనుకూల విధానాలు  ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను జయించాయని మోడీ అన్నారని తెలిపారు. బీజేపీకి ఎన్నికల్లో రెండో పర్యాయం విజయం లభించే అవకాశం 59 శాతంగా ఉందని కూడా ప్రధాని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విషయంలో ఇది 20 శాతంగా, ప్రాంతీయ పార్టీల విషయంలో ఇది 49 శాతంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సాధారణ ప్రజానీకంలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన 'వికసిత భారత్ యాత్ర'లో ఎంపీలు కూడా పాల్గొనాలని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. దేశీయంగా ఉత్పత్తుల తయారీని చేపట్టాల్సిన అవసరాన్ని కూడా మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)