కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి కేసు నమోదు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేతో సహా తొమ్మిది మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్ల కిందట తన తండ్రి అనారోగ్యం బారినపడటంతో బార్మర్‌కు చెందిన రామ్‌ స్వరూప్‌ను కలిసినట్లు మహిళ తెలిపింది. ఆయన లైంగిక దాడికి పాల్పడటంతోపాటు దానిని రికార్డ్‌ చేశాడని ఆరోపించింది. కాగా, బార్మర్ మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేవరం జైన్‌ను రామ్‌ స్వరూప్‌ 2021లో పరిచయం చేశాడని, నాటి నుంచి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. తన టీనేజ్‌ కుమార్తెను లైంగికంగా వేధించారని, తన స్నేహితురాలిపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు మరింత మంది అమ్మాయిలను తీసుకురావాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని వెల్లడించకుండా ఉండేందుకు పోలీసు అధికారులు, ఇతర వ్యక్తులు తనను బెదిరించారని, ఖాళీ కాగితాలపై బలవంతంగా సంతకం చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు మహిళ ఫిర్యాదుపై జోధ్‌పూర్‌లోని రాజీవ్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. బార్మర్ మాజీ ఎమ్మెల్యే మేవరం జైన్‌, ఆర్పీఎస్ అధికారి ఆనంద్ సింగ్ రాజ్‌పురోహిత్‌, ఇద్దరు పోలీస్‌ అధికారులైన బార్మర్ ఎస్‌హెచ్‌వో గంగారామ్ ఖావా, ఎస్‌ఐ దావూద్ ఖాన్, ప్రధాన్ గిర్ధారి సింగ్ సోధా సహా 9 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాగా, 2022 నవంబర్‌లో బార్మర్‌ పోలీసులను రామ్ స్వరూప్ ఆశ్రయించాడు. లైంగిక ఆరోపణల పేరుతో తనను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారని ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేయడంతోపాటు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)