మరణించిన కుమారుడి ఆస్తిలో తల్లికీ వాటా !

Telugu Lo Computer
0


రణించిన కుమారుడి వారసత్వ ఆస్తిలో తల్లికీ హక్కు ఉంటుందని  కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కుమారుడి ఆస్తికి తల్లి కూడా వారసురాలు అవుతుందని, కాబట్టి అందులో ఆమెకు వాటా దక్కుతుంది. కుమారుడి ఆస్తిలో తల్లికి వాటా ఉండదన్న జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎన్ సుశీలమ్మ అనే మహిళ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్​పీ సందేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.సుశీలమ్మ కుమారుడు సంతోష్ మరణించే సమయానికే వారసత్వ ఆస్తిలో ఆమెకు వాటా లభించిందని ట్రయల్ సందర్భంగా డిఫెన్స్ న్యాయవాది వాదించారు. కాబట్టి ఆమెకు మళ్లీ ఆస్తిలో వాటా ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆదేశాలను సవరించాల్సిన అవసరం లేదని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. సంతోష్ ఆస్తిలో తల్లి కూడా వాటాదారు అవుతుందని స్పష్టం చేసింది. హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లి ఫస్ట్ క్లాస్ వారసురాలే అవుతుందని గుర్తు చేసింది. సెషన్స్ కోర్టు ఆదేశం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. 'పిటిషనర్​కు భర్త ఉన్నా హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమారుడి ఆస్తిలో ఆమెకు వాటా దక్కుతుంది. ఆస్తిలో తల్లికీ సమాన హక్కు ఉంటుందనే అంశాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు' అని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సెషన్స్ కోర్టు తన ఆదేశాలను సవరించింది. సంతోష్ ఆస్తిలో సుశీలమ్మకు వాటా దక్కుతుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, తండ్రి ఆస్తిలో కుమార్తెకు వాటా ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2005-హిందూ వారసత్వ (సవరణ) చట్టం ప్రకారం.. తండ్రి ఆస్తిపై కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)