సునామీ సైరన్‌తో ఉలిక్కిపడ్డ జనం !

Telugu Lo Computer
0


సునామీ రానున్నట్లు సైరన్‌ మోగడంతో తీర ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన గోవా లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఉత్తర గోవా జిల్లాలోని పోర్వోరిమ్‌ ప్రాంతంలో ఉన్న కొండపై ఈడబ్ల్యూడీఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇది సునామీ సంభవించడానికి ముందు విపత్తును పసిగట్టి సైరన్‌ ద్వారా హెచ్చరిస్తుంది. అయితే, బుధవారం రాత్రి కాసేపట్లో సునామీ రానున్నట్లు హెచ్చరిస్తూ  సైరన్‌ మోగింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు సైరన్‌ మోగుతూనే ఉంది. దీంతో అది తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ప్రజలు గ్రహించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ మము హేగే ఈ ఘటనపై స్పందించారు. ''సైరన్‌ మోగుతోందని మాకు సమాచారం వచ్చిన వెంటనే ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించాం. భారత వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదు. కాబట్టి సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే సైరన్‌ మోగినట్లు తెలుస్తోంది'' అని ఆమె తెలిపారు. సైరన్‌ మోగడానికి గల సరైన కారణాలను తెలపాలని రాష్ట్ర జలవనరుల శాఖని కలెక్టర్‌ కోరారు. ''రాత్రి భోజనం చేసి ఇంటి బయటకు వెళ్లాం. ఆ సమయంలో సైరన్‌ మోగింది. దీంతో మేమంతా ఎంతో భయాందోళనలకు గురయ్యాం. చాలాసేపు అది మోగుతూనే ఉంది. కానీ సముద్రం నుంచి అలజడి లేదు. సైరన్‌ తప్పుడు హెచ్చరిక జారీ చేస్తోందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నాం'' అని స్థానికుడు అవినాష్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)