రోజ్‌గార్‌ మేళా మోడీకి ఓ ఈఎమ్ఐ లాంటిది !

Telugu Lo Computer
0


రోజ్‌గార్‌ మేళా పథకం ద్వారా ప్రధాని మోడీ తన ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. సోమవారం రోజ్‌గార్‌ మేళాలో 51 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంలో ఉపాధి అవకాశాలు లేవంటూ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  స్పందించారు. ఈ పథకాన్ని ఈఎమ్‌ఐగా ఆయన అభివర్ణించారు. ''ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానంటూ ప్రధాని వాగ్దానం చేశారు. కానీ, దఫదఫాలుగా వేల సంఖ్యలో మాత్రమే నియామక పత్రాలు ఇస్తున్నారు. ఈ పథకం ఈఎమ్‌ఐలా కొనసాగుతోంది. ఏటా వాయిదా పద్దతిలో ఉద్యోగాలను కల్పిస్తున్నారు. మోడీజీ మీకు యువత భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటే.. మీరిలా చేసుండేవారు కాదు. ఈ మేళాలో కేవలం నూతన నియమకాలు మాత్రమే కాకుండా.. పదోన్నతి పొందిన వారి పేర్లు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని మోడీ ప్రస్తావించలేదు. భాజపా మాటల గారడీని, మోసాన్ని యువత గుర్తించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారే మీకు సమాధానం చెబుతారు'' అని ఖర్గే ట్విటర్‌ వేదికగా విమర్శించారు. నియామక ప్రతాల పంపిణీ అంశంపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరామ్‌ రమేష్‌ స్పందిస్తూ.. నోట్ల రద్దు, జీఎస్‌టీ, లౌక్‌డౌన్‌ వంటి అనాలోచిత నిర్ణయాలు స్థూల, మధ్య, సూక్ష్మ రంగాల పరిశ్రమల అభివృద్ధిని దెబ్బతీశాయన్నారు. ప్రధాని తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకే ఈ రోజ్‌ గార్‌ మేళాతో ముందుకొచ్చారని విమర్శించారు. రెండు కోట్లు ఉద్యోగాలంటూ హామీ ఇచ్చి.. ఇప్పుడు వేల ఉద్యోగాలనే ఇస్తున్నారని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)