పబ్లో అసభ్యకరంగా ప్రవర్తించి చెప్పు దెబ్బ తిన్న గోవా డీఐజీ !

Telugu Lo Computer
0


గోవాకు చెందిన డీఐజీ ఎ. కోన్‌ అనారోగ్యంతో కొన్ని రోజులు లీవ్ పెట్టాడు. ఈ క్రమంలో గోవాలోని బగాలో ఒక పబ్‌కు వెళ్లాడు. అక్కడ ఫుల్ గా మద్యం తాగి ఆ మత్తులో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మొదట్లో పట్టించుకోని ఆ మహిళ  డీఐజీ పదే పదే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసుగు చెందింది. డీఐజీ వేధింపులు తట్టుకోలేక తీవ్ర ఆగ్రహంతో మద్యం మత్తులో ఉన్న ఆయనను చెప్పుతో చెంపను చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో చేతిలో లిక్కర్ బాటిల్ పట్టుకున్న డీఐజీ ఎ కోన్ నడవడానికే ఇబ్బందిగా ఉన్నట్లు కనిపించాడు. తూలుతూ తుళ్లుతూ నడుస్తుండగా అతన్ని మరో వ్యక్తి పట్టుకున్నాడు. డీఐజీ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ సీరియస్ అయ్యారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీఐజీ ఎ కోన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గోవా అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై శాసనసభలో గందరగోళం నెలకొంది. డీఐజీ ఎ కోన్‌ను వెంటనే డీఐజీని విధుల నుంచి తొలగించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. దీంతో డీఐజీపై చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ సావంత్ వారికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే డీఐజీ ఎ కోన్ను విధుల నుంచి తొలగించారు. 2009 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఎ కోన్ డీఐజీగా గోవాలో పనిచేయక ముందు ఢిల్లీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)