శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే కానీ, నేరం కాదు !

Telugu Lo Computer
0


భార్యతో శృంగారానికి భర్త నిరాకరించడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే కానీ, ఐపీసీ సెక్షన్ 438ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. భర్త, అత్తమామాలపై సదరు మహిళ పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. కర్ణాటకలో ఒక మహిళకు డిసెంబర్ 18, 2019లో వివాహం జరిగింది. అయితే ఆమె భర్త ఆధ్యాత్మిక మార్గం అనుసరిస్తూ భార్యతో శారీరక బంధాన్ని కొనసాగించేందుకు నిరాకరించాడు. దీంతో సదరు మహిళ 28 రోజుల తర్వాత అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. 2020 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 498ఏ కింద వరకట్న నిరోధక చట్టం కింద భర్త, అత్తామామలపై కేసు పెట్టింది. దీంతో పాటు హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2022లో వీరి వివాహాన్ని ఫ్యామిలీ కోర్టు రద్దు చేసింది. అయితే భర్త, అత్తామామలపై పెట్టిన క్రిమినల్ కేసుల మాత్రం అలాగే కొనసాగించింది. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ భర్త, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో భర్తపై ఉన్న ఆరోపణ ఒక్కటే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన, ప్రేమ అంటే కేవలం మనసుకు సంబంధించిన మాత్రమే కానీ, శృంగారానికి సంబంధించింది కాదని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే కానీ నేరం కాదని తెలిపింది. దీంతో భర్తపై ఉన్న క్రిమినల్ చర్యలు తీసుకుంటే అది వేధింపుల కిందకే వస్తుంది. అందువల్ల ఈ కేసులో అతనిపై క్రిమినల్ కేసులు కొట్టేస్తున్నామని కోర్టు తీర్పు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)