గుజరాత్​లో బీభత్సం సృష్టించిన తుఫాన్ !

Telugu Lo Computer
0


బిపర్​జాయ్ తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోయింది. ప్రధానంగా కచ్, సౌరాష్ట్ర రీజియన్​లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మొత్తం 5,120 ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడంతో 4,600 గ్రామాలకు కరెంట్ సప్లై ఆగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు శుక్రవారం నాటికి 3,580 గ్రామాలకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఇంకో వెయ్యి గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే, తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కచ్ వద్ద తీరం దాటిన తుఫాన్ రాజస్థాన్​వైపు కదులుతున్నది. తర్వాత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. శని, ఆదివారాల్లో రాజస్థాన్​లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తుఫాన్ కారణంగా స్టేట్ పవర్ సప్లై కంపెనీ 'పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్'కు భారీ నష్టం సంభవించింది. 5,120 పోల్స్ విరిగిపోయాయి. అధికారులు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 9 పక్కా, 20 కచ్చా ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 474 ఇండ్లు పాక్షికంగా, 65 పూరిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నష్టపోయిన వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 8 జిల్లాల్లో సహాయక చర్యలను కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఒక్క కచ్ జిల్లాలోనే 40% నష్టం సంభించింది. 18 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు విరిగిన చెట్లు తొలగించడం, రోడ్లు వేయడం చేస్తున్నాయి. ముంబైలో 5, కర్నాటకలో 4 టీమ్స్ సేవలందిస్తున్నాయి. రాజస్థాన్​లో కూడా ఎన్​డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం మోహరించింది. గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​కు ప్రధాని మోడీ  శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావాన్ని, రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గిర్ ఫారెస్ట్​లో జంతువుల రక్షణ కోసం తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)