14 ఔషధాలను బ్యాన్‌ చేసిన ప్రభుత్వం !

Telugu Lo Computer
0


14 ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేదించింది. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిమెసులైడ్, పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోఫెనిరమైన్ మేలేట్, కోడైన్ సిరప్‌లతో సహా 14 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని, వాటిని ఉపయోగించడం వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ (ఎఫ్‌డీసీ) అనేవి స్థిర నిష్పత్తిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాల కలయికను కలిగి ఉంటాయి. 344 కాంబినేషన్‌ల ఔషధాల తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు 2016లోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై ఆయా మందుల తయారీదారులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. శాస్త్రీయ సమాచారం లేకుండా ఆ మందులను రోగులకు విక్రయిస్తున్నట్లు ఆ కమిటీ కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం నిషేధించిన 14 ఎఫ్‌డీసీ మందులు కూడా ఆ 344 ఔషధాల జాబితాలో ఉన్నవే.

Post a Comment

0Comments

Post a Comment (0)