చేతులు పట్టుతప్పితే ?

Telugu Lo Computer
0


చేతుల్లోంచి తరచూ వస్తువులు జారి కిందపడిపోతుంటే గుండెకు సంబంధించిన లేదా మెదడుకు సంబంధించిన, నాడీ వ్యవస్థకు, నరాల పటుత్వానికీ సంబంధించిన అనారోగ్యానికి చేరువ అవుతున్నారని అర్థం. ఇటీవల వైద్య పరిశోధనలు ఈ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాయి. సాధారణంగా ఇలా చేయి పట్టు చిక్కకపోవడాన్నీ, పట్టు జారిపోవడాన్నీ ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. తరచూ చేతుల్లోంచి చిన్నచిన్న వస్తువులు కూడా జారి కిందపడిపోవడాన్నికూడా ఎవరూ పట్టించుకోరు. కానీ అవన్నీ పూర్తిగా మీకు త్వరలోనే గుండెకు, మెదడుకు, నాడీ వ్యవస్థకు లేదా నరాల బలహీనతకు సంబంధించిన తీవ్రస్థాయి అనారోగ్యం కలగబోతోందన్న హెచ్చరికలకు సంకేతాలని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మీ శరీరానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలు, అనారోగ్యాలకు ఇలా పట్టు జారిపోవడాన్ని సూచనగా భావించాలని చెబుతున్నారు. ఇటీవల జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ లో ప్రచురితమైన ఓ ప్రత్యేకమైన వార్త ఈ నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. చేతులు పట్టుతప్పడం, పట్టుజారిపోవడం త్వరలోనే చిత్తవైకల్యానికి సంబంధించిన జబ్బులు రావడానికి సూచనగా భావించాల్సి ఉంటుందని ఈ జర్నల్ ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి సాధారణంగా కనీసం 40 కేజీల బరువును అలవోకగా మోయగలుగుతాడు. దానిపై తనకు కచ్చితంగా పట్టు ఉంటుంది. ఈ సామర్ధ్యం ఎంతో కొంత తగ్గినా సరే కచ్చితంగా అది రాబోయే రోజుల్లో కొని తెచ్చుకోబోయే అనారోగ్యానికి సంకేతమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఐదు కిలోల బరువుకూ ఈ సామర్ధ్యాలు తగ్గుతున్నకొద్దీ దాదాపుగా 18 శాతం పైన చెప్పుకున్న ఆనారోగ్యాలకు చేరువ అవుతున్నట్టే లెక్కని వైద్యులు అంటున్నారు. చేతుల్లో పట్టు చిక్కడం మొత్తంగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సూచనలని అమెరికాలో జరిగిన వైద్య పరిశోధనల్లో తేలింది. దాదాపుగా 40 సంవత్సరాల వయసు దాటిని దగ్గరినుంచీ ఈ సామర్ధ్యం మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే మెల్లమెల్లగా కండరాల బిగువుకూడా తగ్గిపోతున్నట్టు లెక్కని అంటున్నారు. అయితే దీని ప్రభావం పూర్తి స్థాయిలో అప్పటికప్పుడే కనిపించాల్సిన అవసరం లేదనీ, 70 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో దానివల్ల ఎదురయ్యే విషమ పరిణామాలు బయటపడతారనీ చెబుతున్నారు. దాదాపుగా ప్రతి మనిషికీ ఒక దశాబ్దానికి 3 నుంచి 5 శాతం మజిల్ మాస్ పవర్ తగ్గిపోతుందని వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని మిగతా అవయవాల పటుత్వం కోసం రోజూ వ్యాయామం చేసేవాళ్లే తప్ప చేతుల్లోని, మణికట్టులోని కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసేవాళ్లు సంఖ్య పెద్దగా కనిపించదని నిపుణులు అంటున్నారు. కేవలం చిన్న చిన్న గ్రిప్పులు, స్మైలీ బాల్స్ సాయంతో రోజూ కొంత సేపు ప్రత్యేకంగా చేతి కండరాలను బలపరచుకునేందుకు వ్యాయామం చెయ్యాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆర్థరైటిస్, డయాబెటీస్ లేదా ట్రాప్ట్ నెర్వ్ లాంటి ఇబ్బందులవల్ల పూర్తి స్థాయిలో చేతులు పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)