ఛేజ్ చేసి దొంగలను పట్టుకున్న ఎంపీ సుశీల్‌ కుమార్‌ సింగ్‌

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ సింగ్‌, మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి, పారిపోతున్న వారిని ఎనిమిది కిలోమీటర్లు చేజ్ చేసి తన సిబ్బంది సాయంతో బంధించారు. సిరిస్‌ గ్రామానికి చెందిన సరిత కుమారి అనే మహిళ..అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్‌ మెడికల్‌ కాలేజీకి వెళ్లింది. అనంతరం బైక్‌పై తన భర్త రాజేష్‌ గుప్తాతో కలిసి తిరిగి వస్తోంది. ఆ సందర్భంలోనే ముగ్గురు దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు. అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్‌ కుమార్‌ సింగ్‌ చూసి వెంటనే దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని డ్రైవర్‌కు సూచించారు. అలా చాలా సేపు వారిని వెంబడించారు. ఎంపీ కారు దొంగలకు దగ్గరగా వెళ్లగానే వారు సుశీల్‌ కుమార్‌ సింగ్‌కు గన్‌ గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించారు. అయినా సుశీల్‌ కుమార్‌ ఏ మాత్రం బెదరకుండా  వారిని అలాగే వెంబడించారు. చివరకు మధుపుర్‌ అనే గ్రామ సమీపానికి వెళ్లిన దొంగలు బైక్‌ బురదలో కూరుకుపోవడం వల్ల కిందపడ్డారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్‌లు వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్‌ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. నిందితులను టింకు కుమార్‌, ఆనంద్‌ కుమార్‌, ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి ఒక విదేశీ అధునాతన పిస్తోలు, ఒక దేశీయ చేతి తుపాకీ, ఏడు లైవ్‌ కాట్రిడ్జ్‌లు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)