హైదరాబాద్ లో పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ !

Telugu Lo Computer
0


భాగ్యనగరంలో రోడ్డు దాటాలంటే కత్తిమీద సాము లాంటిదే. అందుకే హైదరాబాద్ నగరంలో రోడ్డుదాటే వారి కోసం పెలికాన్ సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదటిసారిగా ట్యాంక్ బండ్ వద్ద పెలికాన్ సిగ్నల్ వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ విదేశాల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌లో పాదచారుల సౌకర్యం, భద్రత కోసం ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చారు. కేవలం ట్యాంక్ బండ్ ప్రాంతంలోనే కాదు నగరం అంతటా 29 ప్రదేశాల్లో పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్‌లో రోడ్లు దాటడానికి పాదచారులకు సహాయపడుతుంది. పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ అనేది ఒక రకమైన పాదచారుల క్రాసింగ్ వ్యవస్థ. ప్రజలు రోడ్లను సురక్షితంగా దాటడానికి సహాయపడుతుంది. శిక్షణ పొందిన ట్రాఫిక్ వాలంటీర్లు ఈ వ్యవస్థను ఆపరేట్ చేస్తారు. జనం గుంపులుగా రోడ్డు దాటాల్సి వచ్చినప్పుడు అటువైపు వాహనాలను నిలిపివేస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఏటా నమోదయ్యే రోడ్డు ప్రమాదాల్లో 45 శాతం పాదచారుల మరణాలే. ఈ ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 50 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో కొన్ని చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికీ పాదచారులు వాటిని వినియోగించడం లేదని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా పాదచారులు రోడ్లు దాటుతున్న సమయంలోనే జరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. పాదచారులు రోడ్లు దాటడానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన సదుపాయాలు పెలికాన్ సిగ్నల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సహాయపడనుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)