భారత్‌లాగానే రష్యా నుంచి చౌకగా క్రూడ్‌ అయిల్‌ని పొందాలని కోరుకుంటున్నా !

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌ మాజీ ‍ప్రధాని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్‌లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్‌ అయిల్‌ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దురదృష్టవశాత్తు తన ప్రభుత్వం పడిపోవడంతోనే అది జరగలేదన్నారు. అదీగాక పాకిస్తాన్‌ ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌ తగ్గింపు రేటుతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని, అలా తన దేశం కూడా కొనుగోలు చేయగలదా అంటూ విచారం వ్యక్తం చేశారు. పాశ్చాత్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తమ దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే దిశగా రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌ ముందుకు వచ్చిందంటూ ఖాన్‌ ప్రశంసించారు. అంతేగాదు యూఎస్‌ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయాలన్న భారత్‌ ప్రధాని మోడీ  తీసుకున్న నిర్ణయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ఇస్లామాబాద్‌ రష్యాతో చౌక చమురు రవాణా ఒప్పందం ఖారారు చేసుకుందని, వచ్చే నెలలో మొదటి షిప్‌మెంట్‌ కార్గో ద్వారా పాకిస్తాన్‌కు చేరుకుంటుందని పేర్కొనడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)