చిన్నారికి విజయవంతంగా క్యాన్సర్‌ కణితి తొలగింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)లో రెండేళ్ల చిన్నారికి కీలక శస్త్రచికిత్స నిర్వహించారు. కాలేయంపై పెరిగిన క్యాన్సర్‌ కణితిని వైద్య బృందం తొలగించి చిన్నారికి ఊరట కలిగించింది. ఈ తరహా చికిత్స కేజీహెచ్‌ పిల్లల శస్త్రచికిత్స విభాగంలో ఇంతవరకు చేయలేదని, రిస్కుతో కూడిన్నది అయినప్పటికీ తమ వద్ద ఉన్న అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. చికిత్సకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 'విశాఖకు చెందిన చిన్నారి శాన్విత (2) కాలేయంలో క్యాన్సర్‌ కణితో బాధపడుతూ ఈనెల 2న కేజీహెచ్‌లో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా 250 గ్రాముల క్యాన్సర్‌ కణితి కాలేయం ఎడమభాగంలో ఉన్నట్లు గుర్తించారు. ఈనెల 6న వైద్య బృందం నాలుగు గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి క్యాన్సర్‌ కణితిని తొలగించింది. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఈనెల 18న డిశ్చార్జి చేసి ఇంటికి పంపామ'ని డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో వైద్యులు భాస్కర్‌రెడ్డి, హాసంతి, రమణ, రాజీవ్‌, శ్రీనివాస్‌, నివేత, మాధురి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)