విజయప్రియ నిత్యానంద ప్రసంగాలు పరిగణనలోకి తీసుకునే ప్రసక్తి లేదు !

Telugu Lo Computer
0


యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి   సమావేశంలో పాల్గొనడంపై యుఎన్ మానవ హక్కుల కార్యాలయం గురువారం వివరణ ఇచ్చింది. భారతదేశానికి చెందిన పరారీలో ఉన్న నిందితుడు, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించినట్లు చెప్పుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు గత వారం జెనీవాలో జరిగిన బహిరంగ సమావేశాలకు హాజరై చేసిన ప్రసంగాలు అసంబద్ధమైనవని, తుది ముసాయిదా ప్రకటనలో వీటిని పరిగణనలోకి తీసుకోబోమని యుఎన్ హమానవ హక్కుల కార్యాలయం స్పష్టం చేసింది. యుఎన్‌కె ప్రతినిధులమని చెప్పుకుంటున్న వారు జెనీవాలో జరిగిన రెండు యుఎన్ బహిరంగ సమావేశాలలో పాల్గొన్న మాట నిజమేనని ఆఫీస్ ఆఫ్ ది హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్(ఓహెచ్‌సిహెచ్‌ఆర్) ధ్రువీకరించింది. అయితే వారు ప్రచార కరపత్రాలను పంచడానికి అనుమతించలేదని, వారి ప్రసంగాలను పరిగణనలోకి తీసుకునే ప్రసక్తి లేదని కార్యాలయం స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన రెండు సమావేశాలలో పాల్గొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు యుఎన్‌లో శాశ్వత ప్రతినిధినని చెప్పుకుంటున్న మాత విజయప్రియ నిత్యానంద ప్రసంగించడం, ఆ వీడియోలో యుఎన్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం కావడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో హైకమిషనర్ కార్యాలయం నుంచి ఈ వివరణ వెలువడడం గమనార్హం. అటువంటి బహిరంగ సమావేశాలలో ప్రవేశం అందరికీ ఉంటుందని, ఎన్‌జిఓలు, సాధారణ ప్రజలు సైతం ఈ సమావేశాలలో పాల్గొనవచ్చని కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఆయా సంస్థల గుర్తింపును, వారి ప్రసంగాల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. కాగా..జెనీవాలో భారత శాశ్వత మిషన్ నుంచి దీనిపై ఎటువంటి వివరణ ఇప్పటివరకు వెలువడలేదు. ఇది ఇలావుండగా యుఎన్ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస శాశ్వత రాయబారిగా చెప్పుకుంటూ పాల్గొన్న విజయప్రియ నిత్యానంద తన ప్రసంగంపై గురువారం వివరణ ఇచ్చారు. భగవాన్ నిత్యానంద పరమశివంను ఆయన జన్మస్థానంలో కొన్ని హిందూ శక్తులు వేధింపులకు గురిచేశాయని మాత్రమే తాను చెప్పానని, భారతదేశాన్ని తన గురు పీఠంగా తాము భావిస్తామని, ఆ దేశం పట్ల తమకు ఎంతో గౌరవభావం ఉందని ఆమె ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)