హౌరాలో మరోసారి ఘర్షణలు

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. గురువారం రామనవమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం శిబ్‌పూర్‌లో ఊరేగింపుకు అనుమతించిన కొద్దిసేపటికే దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే అల్లరిమూకలు మరో వర్గంపై రాళ్లు రువ్వాయి. మీడియాపై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 36 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారని, పలు దుకాణాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు. దీంతో వారిని అదుపుచేసేందుకు టియర్‌గ్యాస్‌ ప్రయోగించామని అన్నారు. ఈ దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హింసాత్మక ఘటనపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఆ మార్గంలోకి ఊరేగింపును మళ్లించారని అన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాన్ని సృష్టించేలా బిజెపి గూండాలను నియమించిందని మండిపడ్డారు. వారి ఊరేగింపులో ఎందుకు కత్తులను ప్రదర్శించారని ప్రశ్నించారు. హౌరాలో ఈ విధంగా ప్రవర్తించే ధైర్యం వారికి ఎక్కడి నుండి వచ్చిందని అన్నారు. అయితే టిఎంసి అబద్ధాలు చెబుతోందని బిజెపి వాదించింది. హౌరా మైదానంలో భారీ ఊరేగింపుకు అనుమతి ఉందని, అక్కడికి వెళ్లేందుకు ఇదే మార్గమని బిజెపి పేర్కొంది. అన్ని ప్రాంతాల్లోకి రామనవమి ఊరేగింపు వెళ్లేందుకు అనుమతి లేని దుస్థితి భారతదేశంలో ఏర్పడిందని పశ్చిమబెంగాల్‌ బిజెపి అధ్యక్షుడు సుకాంతా మజుందార్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)