మాతృభాషకు పెద్ద పీట వేయండి !

Telugu Lo Computer
0


ప్రకృతిలో మార్పు స్పష్టంగా కనిపించే ఈ వసంత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తూ మన పెద్దలు అందించినదే ఉగాది పండగని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లోకి నూతన శోభను తీసుకురావాలని, ఆయురారోగ్యాలను, సుఖ సంపదలను, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యాన్ని అందించే ఉగాది పచ్చడి, ఆనందాన్ని అందించే ఆత్మీయుల ఆగమనం మనిషికి నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ మన సనాతన మూలాల్లోకి తరలివెళ్లే సంకల్పం తీసుకోవాలనేది తన ఆకాంక్షని, భవిష్యత్‌ తరాలను మన సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దాలన్నది తన అభిలాషని పేర్కొన్నారు. ఉగాది వేళ మాతృభాష పరిరక్షణ, పరివ్యాప్తి మన లక్ష్యం కావాలని, ఇంటా బయట బడిలో, గుడిలో అమ్మఒడిలో నేర్చుకున్న మాతృభాషకు పెద్ద పీట వేయాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడాలని, మాతృ భాషలోని పద్యాలు, ఇతర విశేషాలను నేర్పి అమ్మ భాషకు పిల్లలను వారసులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మన హక్కులను గుర్తు చేస్తూనే ప్రకృతిపై మన బాధ్యతలను పండగలు గుర్తు చేస్తాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు ప్రజలకు శోభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. మన సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనంగా ఉగాది జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)